ఫార్మా ప్రమాదాల్లో వారే బలి
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:20 AM
ఫార్మా కంపెనీల్లో జరిగే ప్రమాదాల్లో మందుల ఉత్పత్తితో సంబంధం లేనివారే పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు.
అత్యధికులు ‘ప్రొడక్షన్’తో సంబంధం లేని విభాగాలకు చెందినవారు...
ఉత్పత్తి విభాగం ప్రత్యేకంగా ఉండాలన్న నిబంధన బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు
తెలంగాణలోని సిగాచీలో భారీ ప్రమాదంతో అప్రమత్తమైన అధికారులు
ఇకపై 250 మంది కార్మికులు దాటితే సేఫ్టీ ఆఫీసర్
సెన్సార్లన్నీ ఐఓటీతో కనెక్షన్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఫార్మా కంపెనీల్లో జరిగే ప్రమాదాల్లో మందుల ఉత్పత్తితో సంబంధం లేనివారే పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. నెల క్రితం విశాఖ పార్మా సిటీ (రాంకీ)లో సాయి శ్రేయాస్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరణించిన ఇద్దరూ ఉత్పత్తి విభాగానికి సంబంధం లేనివారే. గతంలో సాహితీ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో కూడా వేరే విభాగాలవారు ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి.
నిబంధనల ప్రకారం ఉత్పత్తి చేసే ప్రాంతానికి (ప్రొడక్షన్ బ్లాక్) మిగిలిన విభాగాలు దూరంగా ఉండాలి. అంటే క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎస్యూరెన్స్, పీడీ లేబొరేటరీలు వేరే దగ్గర ఉండాలి. కానీ కంపెనీల యాజమాన్యాలు స్థలం కలసి వస్తుందని అన్నింటినీ ఒక్క దగ్గరే పెడుతున్నారు. దాని వల్ల ఉత్పత్తి జరిగే ప్రాంతంలో ప్రమాదం జరిగితే దానితో సంబంధం లేనివారు కూడా చనిపోతున్నారు. సాహితీ ఫార్మాలో కూడా ఇలాగే జరిగింది. బిల్డింగ్ డిజైన్‌ను ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు సరిగా తనిఖీ చేయకపోవడం, ఉత్పత్తికి అనుమతులు ఇచ్చే ముందు క్షేత్ర పరిశీలనలో కూడా వీటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. తెలంగాణాలోని సిగాచీలో జరిగిన భారీ ప్రమాదం కూడా ఇలాంటిదేనని తేలడంతో ఇప్పుడు అధికారులు అప్రమత్తమై ఉత్పత్తికి సంబంధం లేని విభాగాలను ప్రొడక్షన్ బ్లాక్‌కు దూరంగా ఉంచాలని చెబుతున్నారు.
250 మంది దాటితే సేఫ్టీ ఆఫీసర్ తప్పనిసరి
ఇప్పటివరకూ ఫార్మా కంపెనీలలో వేయి మంది వర్కర్లు ఉంటనే సేఫ్టీ ఆఫీసర్‌ను నియమించుకోవాలనే నిబంధన ఉండేది. ఇటీవల కేంద్రం దానిని సవరించి 250 మంది ఉంటే సేఫ్టీ ఆఫీసర్ తప్పనిసరి అని స్పష్టంచేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా జీఓ జారీచేసింది. దీనిని అమలు చేయాల్సి ఉంది.
ఫార్మా కంపెనీల్లో పొగ వచ్చినా, మంట వచ్చినా, రసాయనాల వాసన వచ్చినా వాటిని పసిగట్టి హెచ్చరించే సెన్సార్లు ఉంటాయి. అయితే ప్రమాదాలు జరిగినా యాజమాన్యాలు కొన్నింటిని కప్పిపుచ్చడం, వాస్తవాలు వెల్లడించకపోవడం జరుగుతోంది. ఇకపై అలాంటి వాటికి అవకాశం లేకుండా సెన్సార్లు అన్నింటినీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కి కనెక్ట్ చేయాలని ఫ్యాక్టరీస్ విభాగం ఆదేశించింది. వాటిని ఎమర్జన్సీ కాల్ సెంటర్‌తో పాటు ఫార్మా సిటీలోని అసోసియేషన్ భవనం(ఎంఏఎస్‌ఆర్‌ఎం)కు కూడా అనుసంధానం చేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఏపీఐఐసీకి కూడా ఆ సమాచారం వెళ్లేలా చూడాలని సూచించారు. దీనివల్ల ఎటువంటి ప్రమాద సమాచారమైనా తక్షణమే కంపెనీ బయట ఉండే వారికి కూడా వెళ్లి, వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుంటుంది.
Updated Date - Jul 16 , 2025 | 01:20 AM