ప్రభుత్వ శాఖల్లో బదిలీల సందడి!
ABN, Publish Date - Jun 14 , 2025 | 01:17 AM
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు, సిబ్బంది బదిలీల ప్రక్రియ తుది దశకు చేరింది. బదిలీల కోసం దరఖాస్తు చేయడానికి తొమ్మిదో తేదీ సాయంత్రంతో గడువు ముగియగా, అదే రోజు రాత్రి నుంచి ఆన్‌లైన్‌లో బదిలీల కౌన్సెలింగ్ మొదలైంది.
పలువురు అధికారులకు స్థానచలనం
పూర్తయిన హెచ్‌ఎంలు, ఎస్‌ఏల బదిలీలు
ఎస్‌జీటీలకు కొనసాగుతున్న ప్రక్రియ
సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు
అనకాపల్లి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు, సిబ్బంది బదిలీల ప్రక్రియ తుది దశకు చేరింది. బదిలీల కోసం దరఖాస్తు చేయడానికి తొమ్మిదో తేదీ సాయంత్రంతో గడువు ముగియగా, అదే రోజు రాత్రి నుంచి ఆన్‌లైన్‌లో బదిలీల కౌన్సెలింగ్ మొదలైంది. ఐదేళ్లపాటు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి వుంటుంది. ఇప్పటికే రెవెన్యూ శాఖలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్‌లలో పలువురికి స్థానచలనం కలిగింది. బదిలీ అయిన ఉద్యోగులు కొత్త స్థానంలో విధుల్లో చేరడం, అంతవరకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు రిలీవ్ అవుతుండడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో హడావిడి నెలకొంది. కాగా రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ, మునిసిపల్‌తోపాటు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగుల బదిలీలు తుదిదశకు చేరాయి. ఉపాధ్యాయులకు సంబంధించి హెచ్‌ఎంలు, ఎస్‌ఏల బదిలీలు ఆన్‌లైన్‌లో ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న 98 మంది గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులకు స్థానచలనం కల్పించారు. వీరిలో 35 మందికిపైగా ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ బదిలీ చేశారు. జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి 580 మంది స్కూల్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పించారు. ఎస్‌జీటీల బదిలీలు మాన్యువల్‌గా ఉమ్మడి జిల్లాను యూనిట్‌గా తీసుకుని మూడు రోజుల నుంచి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
జిల్లా అధికారులు బదిలీ
జిల్లాలో వివిధ శాఖలకు చెందిన 11 మంది జిల్లాస్థాయి అధికారులు బదిలీ అయ్యారు. జిల్లా ఉద్యాన శాఖాధికారి ప్రభాకరరావు పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీకాగా ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంచి రహీం రానున్నారు. జిల్లా పంచాయతీ అధికారి శిరీషారాణి విజయనగరం జిల్లాకు బదిలీకాగా.. ఆమె స్థానంలో సందీప్ వస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖాధికారిగా మంగవాణి, స్ట్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీగా సూర్యలక్ష్మి బదిలీపై జిల్లాకు వస్తున్నారు.
గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బందికీ బదిలీలు
జిల్లాలో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. 2025 మే 31వ తేదీ నాటికి ఒకేచోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. జిల్లాలో 522 సచివాలయాల్లో 3,650 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బదిలీల కోసం జూలై 10వ తేదీలోగా హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేయాలని జిల్లా సచివాలయాల సమన్వయ అధికారి మంజులా వాణి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ, బదిలీలను ప్రభుత్వం ఒకేసారి చేపట్టనుంది. హేతుబద్ధీకరణ తరువాత మిగులు ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్‌లపై పంపనున్నది. జనాభా పరంగా సచివాలయాలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది. ’ఎ’ కేటగిరీ సచివాలయంలో ఆరుగురు, ’బి’ కేటగిరీ సచివాలయంలో ఏడుగురు, ’సి’ కేటగిరీ సచివాలయంలో ఎనిమిదివి మంది ఉద్యోగులు వుంటారు.
Updated Date - Jun 14 , 2025 | 01:17 AM