వీడని ముసురు
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:36 PM
మన్యాన్ని వర్షం వీడడం లేదు. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ముంచగింపుట్టు, పెదబయలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
మన్యంలో కొనసాగుతున్న వర్షాలు
పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు
వర్షాలతో జనజీవనానికి అంతరాయం
పాడేరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): మన్యాన్ని వర్షం వీడడం లేదు. గత రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగుల ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్.పురం, ముంచగింపుట్టు, పెదబయలు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాడేరు మండలం మొదలుకుని జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ, చింతపల్లి మండలాల్లో గెడ్డల ఉధృతి కొనసాగుతున్నది. ముసురు వాతావరణంతోజనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతుండగా, ఖరీఫ్ వ్యవసాయ పనులను సైతం చేసుకునేలా తెరిపివ్వడం లేదని రైతులు అంటున్నారు. ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న వర్షాల నేపథ్యంలో పల్లెల్లో వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు. తాజా వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.
ఎటపాకలో అత్యధిక వర్షపాతం
జిల్లాలో ఎటపాకలో సోమవారం 44.4 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదుకాగా, కూనవరంలో 44, ముంచంగిపుట్టులో 39.2, వీఆర్.పురంలో 29.4, చింతూరులో 22, చింతపల్లిలో 12.4, హుకుంపేటలో 11.4, మిగిలిన మండలాల్లో 10 మిల్లీమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది.
కొయ్యూరులో 31.1 డిగ్రీల ఉష్ణోగ్రత
వర్షాలు కొనసాగుతున్నప్పటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సైతం ఒక మోస్తరుగా కొనసాగుతున్నాయి. కొయ్యూరులో 31.1, చింతపల్లిలో 27.6, అనంతగిరిలో 26.3, జి.మాడుగులలో 26.1, జీకేవీధిలో 25.3, పాడేరులో 25.2, డుంబ్రిగుడలో 24.6, హుకుంపేటలో 24.6, అరకులోయలో 24.4, పెదబయలులో 24.1, ముంచంగిపుట్టులో 23.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: మండల పరిధిలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షానికి రహదారులు చిత్తడిగా మారాయి. మట్టి రహదారులు బురదమయంగా మారాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. వాగులు వంకలు, మత్స్యగెడ్డ పాయలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు.
అరకులోయలో...
అరకులోయ: మండలంలో ముసురు వాతావరణం కొనసాగుతోంది. సోమవారం తెల్లవారుజూము నుంచి ఉదయం 10 గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఆ తరువాత సాయంత్రం వరకు ఒక మోస్తరుగా వర్షం కురిసింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. రహదారులు చిత్తడిగా మారడంతో రాకపోకలకు అవస్థలు తప్పలేదు.
పెదబయలులో..
పెదబయలు: మండల వ్యాప్తంగా సోమవారం కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించింది. పెదబయలు వారపు సంత ప్రదేశంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడంతో సంతకు వచ్చిన వర్తకులు, వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మట్టి రోడ్లు చిత్తడిగా మారాయి.
Updated Date - Jul 07 , 2025 | 11:36 PM