జలపాతాల సవ్వడి
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:01 AM
జిల్లాలోని పలు జలపాతాలు ఉరకలేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో జలపాతాలు కళకళలాడుతున్నాయి. చింతపల్లి మండలంలోని యర్రవరం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. గిరిజన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జలపాతం దిగువకు ఉరకలేస్తున్నది. వంద అడుగుల ఎత్తు నుంచి వేగంగా నీరు కిందకు పడుతుండడంతో వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నది. జలపాతం దిగువనున్న యర్నాపల్లి వాగులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నది.
- ఉరకలేస్తున్న యర్రవరం, సీలేరు, తారాబు జలపాతాలు
- కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు చేరి ఉధృతంగా ప్రవాహం
చింతపల్లి, జూలై 29: జిల్లాలోని పలు జలపాతాలు ఉరకలేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో జలపాతాలు కళకళలాడుతున్నాయి. చింతపల్లి మండలంలోని యర్రవరం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది. గిరిజన ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో జలపాతం దిగువకు ఉరకలేస్తున్నది. వంద అడుగుల ఎత్తు నుంచి వేగంగా నీరు కిందకు పడుతుండడంతో వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నది. జలపాతం దిగువనున్న యర్నాపల్లి వాగులు సైతం ఉధృతంగా ప్రవహిస్తున్నది.
సీలేరు జలపాతం కళకళ
సీలేరు: జీకేవీధి మండలం సీలేరు జలపాతం (ఐస్ గెడ్డ) జలకళను సంతరించుకుంది. సీలేరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో సీలేరు- చింతపల్లి ప్రధాన రహదారిలో రహదారి పక్కనే ఎత్తైన కొండల పైనుంచి పాల నురగ వలే కిందకు జాలువారుతూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. ఇక్కడి నీరు మండు వేసవిలో కూడా చల్లగా ఉండడంతో దీనిని ఐస్ గెడ్డగా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ జలపాతం ఉరకేస్తుండడంతో సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
ఉధృతంగా తారాబు
పెదబయలు: మండలంలోని జామిగూడ పంచాయతీ తారాబు గ్రామ సమీపంలోని తారాబు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో జలపాతానికి భారీగా వరద నీరు చేరింది. ఎత్తైన కొండల పైనుంచి జాలువారుతున్న జలపాత హొయలును పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:01 AM