ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐటీ కంపెనీల దాగుడుమూతలు

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:47 AM

విశాఖపట్నంలో ఐటీ రంగం పరిస్థితి విచిత్రంగా ఉంది. ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ ముందుకువస్తున్న సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు దక్కించుకున్న తరువాత అడ్రస్‌ ఉండడం లేదు.

  • సంస్థలు వచ్చేదెన్నడో, ఉద్యోగాలు ఇచ్చేదెన్నడో?

  • ఇటీవల టీసీఎస్‌, కాగ్నిజెంట్‌కు భూముల కేటాయింపు

  • గతంలోనూ అనేక కంపెనీలకు భూములు

  • అనేక సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించకుండానే దశాబ్దాలుగా కాలక్షేపం

  • నెరవేరని పాలకుల లక్ష్యం

  • నిర్దేశిత గడువులోగా ఉపాధి కల్పనకు ఒత్తిడి తేవలసిందే

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో ఐటీ రంగం పరిస్థితి విచిత్రంగా ఉంది. ఉద్యోగాలు కల్పిస్తాం అంటూ ముందుకువస్తున్న సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు దక్కించుకున్న తరువాత అడ్రస్‌ ఉండడం లేదు. అలా తీసుకున్న భూముల్లో కనీసం భవనాలు కూడా నిర్మించని సంస్థలు ఎన్నో ఉన్నాయి. మరికొన్ని సంస్థలు అందమైన భారీ భవనాలు నిర్మించి, ఆపరేషన్లు ప్రారంభించకుండా ఖాళీగా ఉంచుతున్నాయి. హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. గత పదిహేనేళ్లుగా విశాఖపట్నంలో ఇదే జరుగుతోంది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి.

నగర నడిబొడ్డున విప్రో సంస్థకు 2006లో ఏడు ఎకరాలు ఇచ్చారు. అందులో నాలుగు ఎకరాల్లోనే భవనం నిర్మించారు. మరో మూడు ఎకరాలు ఖాళీగా ఉంది. ఆరు వేల మందికి ఉపాధి కల్పిస్తామని విప్రో హామీ ఇచ్చింది. భారీ భవనాన్ని ఏళ్ల తరబడి ఖాళీగా ఉంచారు. ఆమధ్య మరో సంస్థకు అందులో కొన్ని అంతస్థులు అద్దెకు ఇవ్వగా, వారు రెండేళ్లు ఉండి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆరు అంతస్థుల భవనంలో కేవలం వంద మంది మాత్రమే ఉన్నారు. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌ ధరల ప్రకారం రూ.700 కోట్లుపైనే. ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా ఆ సంస్థను పిలిచి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ప్రశ్నించడం లేదు. ఎదురుగా సత్యం కంపెనీకి భూమి ఇవ్వగా ఆ సంస్థ దివాలా తీయడంతో టెక్‌ మహీంద్ర టేకోవర్‌ చేసి నడుపుతోంది.

ఇక రుషికొండ ఐటీ పార్కులో భూములు తీసుకున్న కంపెనీల్లో కేవలం పది మాత్రమే పూర్తిస్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మిగిలిన సంస్థలన్నీ పేరుకు కంపెనీ నడుపుతున్నట్టు నటిస్తున్నాయి. కొన్ని అద్దెకు ఇచ్చుకున్నాయి. మరికొన్ని భవనాలు నిర్మించి కనీసం ప్రారంభోత్సవం కూడా చేయకుండా వదిలేశాయి.

అదానీ పనులు ప్రారంభమే కాలేదు

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు (2014-19) డేటా సెంటర్‌ కోసం అదానీ కంపెనీ భూమి తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో దానిని రద్దు చేసి మధురవాడలో హిల్‌ నంబరు-4లో 130 ఎకరాలు ఒకసారి, మరోసారి 70 ఎకరాలు కేటాయించింది. అందులో రూ.22 వేల కోట్లు పెట్టుబడి పెట్టి, 25 వేల మందికి ఏడేళ్లలో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికి 2023 మే నెలలో అప్పటి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రెండేళ్లు పూర్తయింది. వంద గజాల నిర్మాణం కూడా అక్కడ జరగలేదు. ఇక మిగిలింది ఐదేళ్లే. ఆలోగా 25 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ అదానీని ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. అక్కడ ఎకరా రూ.20 కోట్లు విలువ ఉండగా, కోటి రూపాయలకు ఇచ్చారు. పెద్ద కంపెనీలు తక్కువ ధరకు భూములు తీసుకొని పనులే ప్రారంభించడం లేదు. ఆర్భాటమైన ప్రకటనలే మిగులుతున్నాయి.

టీసీఎస్‌ ఆపరేషన్లు ఎప్పుడు?

ఐటీ మంత్రి లోకేశ్‌ చేసిన అనేక ప్రయత్నాల మీదట టీసీఎస్‌ కంపెనీ విశాఖపట్నం రావడానికి అంగీకరించింది. రుషికొండ ఐటీ పార్కులోనే వారికి 21.6 ఎకరాలు కేటాయించారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించడానికి అదే ఐటీ పార్కులో మిలీనియం టవర్‌-బిని పూర్తిగా కేటాయించారు. వారి కోసం ఆ భవనానికి ఆర్థిక మండలి నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. మూడు నెలల్లో టీసీఎస్‌ ప్రారంభం అవుతుందని చెప్పి ఆరు నెలలైంది. ఇప్పటికీ అక్కడ సందడి లేదు. తాజాగా కాగ్నిజెంట్‌ కంపెనీకి 21.8 ఎకరాలు కాపులుప్పాడలో ఇచ్చారు. ఆ సంస్థ 2029 మార్చి నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించింది. అంటే దాదాపుగా నాలుగేళ్ల తరువాత అన్నమాట. ఏడాదిలోగా ఎక్కడో ఒక భవనం తీసుకొని అందులో కొంతమందితో కంపెనీని ప్రారంభించి, ఆ తరువాత సొంత భవనంలోకి మారి పూర్తిస్థాయిలో విస్తరించవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఒప్పించాలి. 2029 ఎన్నికల సంవత్సరం. ఒకవేళ అప్పటికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. దీనిపై పునరాలోచన చేయాల్సి ఉంది.

నాలుగేళ్ల తరువాతా!?

ఐటీ కంపెనీలకు కూటమి ప్రభుత్వం ఎకరా భూమి 99 పైసలకే ఇస్తోంది. పేరొందిన పెద్ద సంస్థలు విశాఖపట్నం వంటి ద్వితీయ శ్రేణి నగరానికి రావాలంటే రాయితీలు ఇవ్వాల్సిందే. కాకపోతే వారితో కనీసం రెండేళ్లలో ఆపరేషన్లు ప్రారంభించేలా చేయగలిగినప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. అంతే తప్ప ఇప్పుడు భూములు తీసుకొని నాలుగేళ్ల తరువాత ఉద్యోగాలు ఇస్తామంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం.

Updated Date - Jun 27 , 2025 | 12:47 AM