తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ల మొరాయింపు
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:38 AM
తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల నిర్వహణ దారుణంగా ఉంది. బ్యాటరీలు పనిచేయక, టైర్లు అరిగిపోయి వాహనాలు కదలడం లేదు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు అరబిందో కంపెనీ నిర్వహణలో నడుస్తున్నాయి. అయితే వీటి నిర్వహణను ఆ సంస్థ గాలికొదిలేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టైర్లు అరిగిపోయి ... బ్యాటరీలు పని చేయక బండి కదలాలంటే నెట్టాల్సిన దుస్థితి
మరమ్మతుల గురించి పట్టించుకోని నిర్వహణ సంస్థ
నర్సీపట్నం, జూలై 14(ఆంధ్రజ్యోతి): తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల నిర్వహణ దారుణంగా ఉంది. బ్యాటరీలు పనిచేయక, టైర్లు అరిగిపోయి వాహనాలు కదలడం లేదు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు అరబిందో కంపెనీ నిర్వహణలో నడుస్తున్నాయి. అయితే వీటి నిర్వహణను ఆ సంస్థ గాలికొదిలేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 22 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు 2015 డిసెంబరు 31న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన తరువాత తల్లీబిడ్డని క్షేమంగా ఇంటికి చేర్చడానికి ఉచిత సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ వాహనాలు అందుబాటులో లేనప్పుడు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఈ పథకాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జీవీకే కంపెనీ నుంచి తప్పించి అరబిందో కంపెనీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందం కాల పరిమితి పూర్తి అయిపోయినట్టు తెలిసింది. ప్రభుత్వం తిరిగి ఒప్పందం చేసుకోలేదు. దీంతో సదరు సంస్థ వాహనాల నిర్వహణ బాధ్యతలను పట్టించుకోవడం లేదు. చిన్న మరమ్మతులు కూడా చేయించడం లేదు.
మూలకు చేరిన వాహనాలు
జిల్లాలో 22 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఉండగా, నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి పరిధిలో ఆరు వాహనాలు తిరుగుతున్నాయి. టైర్లు అరిగిపోయి ఒక వాహనాన్ని గత 10 రోజులు నుంచి ఆపేశారు. బ్యాటరీలు చార్జింగ్ అవ్వడం లేదు. కొత్త బ్యాటరీలు పంపడం లేదు. బండి స్టార్ట్ అవ్వాలంటే ముందుకు నెట్టాల్సి వస్తుంది. టైర్లు అరిగిపోయి ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి ఉంది. జాయింట్ క్రాస్‌లు మరమ్మతులకు గురవుతున్నాయి. మాడుగుల మండలం కేజీపురం వాహనానికి మరమ్మతులు చేయాల్సి ఉంది. అనకాపల్లిలోని ఒక వాహనం రిపేరు చేయించడానికి షోరూమ్‌లో పెట్టారు. ఈ బండి బ్యాటరీని చోడవరం వాహనానికి వేసి తిప్పుతున్నారు. జిల్లాలోని అన్ని వాహనాలకు బ్యాటరీలు, టైర్ల సమస్య ఉంది. వాహనాలు కదిలిన తరువాత గమ్యస్థానాలకు చేరే వరకు గ్యారెంటీ ఉండడం లేదు. ఈ విషయమై ఉమ్మడి విశాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ని వివరణ కోరగా కొత్త బ్యాటరీలు, టైర్ల కోసం ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
Updated Date - Jul 15 , 2025 | 12:38 AM