పెచ్చుమీరుతున్న రౌడీషీటర్ల ఆగడాలు
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:12 AM
నగరంలో రౌడీషీటర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది.
కత్తులు జేబులో పెట్టుకుని సంచారం
అర్ధరాత్రి వేళ హల్‌చల్
గుంపులుగా చేరి మద్యం, గంజాయి సేవనం
మత్తులో విచక్ష ణ కోల్పోయి కత్తులతో స్వైర విహారం
ముకుతాడు వేయడంలో విఫలమవుతున్న పోలీసులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఈనెల 13న డాబాగార్డెన్స్ వద్ద అర్ధరాత్రి సమయంలో రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవ జరిగింది. కత్తులతో దాడి చేసుకోవడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఈనెల 17న కంచరపాలెం ప్రాంతానికి చెందిన మూర్తిపై పెందుర్తికి చెందిన రౌడీషీటర్ నగల్ల సాయి అర్ధరాత్రి మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. ఇద్దరూ మద్యం సేవిస్తుండగా మాటామాటా పెరగడంతో సాయి కత్తితో దాడికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు.
నగరంలో రౌడీషీటర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. రోడ్లపై గుంపులుగా చేరి మద్యం, గంజాయి సేవిస్తూ కత్తులు పట్టుకుని హల్‌చల్ చేస్తున్నారు. రౌడీగ్యాంగ్‌ల మధ్య కొట్లాటలు సాధారణంగా మారిపోయాయి. అర్ధరాత్రివేళ నడిరోడ్డుపై నిలబడి...ఆ దారిని వెళుతున్న వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరికొందరు గంజాయి సేవిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. గాజువాక బీసీ రోడ్డులో అల్లరిమూకలు రోడ్డుపై అల్లడి చేస్తుండడంతో ఎదురుగా ఉన్న ఇంటి యజమాని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి, వెనుతిరిగారు. దానిని సహించలేని అల్లరిమూకలు అర్ధరాత్రి గోడ దూకి ఆయన ఇంట్లోకి వెళ్లి విధ్వంసం సృష్టించారు. రైల్వే న్యూకాలనీలో ఇద్దరు వ్యక్తులు ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసుకోవడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. అర్ధరాత్రి బైక్‌లపై తిరుగుతూ వీరంగం సృష్టిస్తున్న వారి సంఖ్యా ఎక్కువగానే ఉంది.
స్పందించని పోలీసులు
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆదివారం రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లలో మొక్కుబడిగా కౌన్సెలింగ్ ఇవ్వడం వల్ల ఫలితం ఉండడం లేదు. కత్తులతో తిరిగినా, దాడి చేసినా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారనే భయం రౌడీషీటర్లలో లేకుండా పోయింది. వీధుల్లో ఆకతాయిలు వాహనాలతో వీరంగం సృష్టించడం, దారిన వచ్చిపోయే యువతులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు. అటువంటి వారిపై పోలీసులు నిఘా పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. సరైన కారణంగా లేకుండా అర్ధరాత్రి రోడ్లపై గుంపులుగా తిరిగే వారిని స్టేషన్‌కు తరలించాలని, ఆ దిశగా పోలీసులు దృష్టిపెట్టాలంటున్నారు.
Updated Date - Jul 22 , 2025 | 01:12 AM