ప్రతిపాదనల్లోనే వడ్డాది వారధి
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:48 AM
మండలంలో వడ్డాది వద్ద పెద్దేరుపై వంతెన నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందా అని రెండు జిల్లాలకు చెందిన పలు మండలాల ప్రజలు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. పూర్వకాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో మూడేళ్ల క్రితం పాక్షికంగా కూలిపోయింది. కొద్ది నెలల తరువాత పక్కనే నదిలో నుంచి కాజ్‌వే నిర్మించారు. ఇది తక్కువ ఎత్తులో వుండడంతో పెద్దేరు నదికి వరద వస్తే వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. కొత్త వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది.
మూడేళ్ల క్రితం కూలిన పాత వంతెన
నెలలపాటు స్తంభించిన రవాణా
తాత్కాలికంగా కాజ్‌వే నిర్మాణం
పెద్దేరు నదికి వరద వస్తే ముంపు
రూ.25 కోట్లతో కొత్త వంతెన నిర్మిస్తామన్న గత వైసీపీ పాలకులు
అమలుకు నోచుకోని హామీ
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిశీలించి ఎంపీ, ఎమ్మెల్యే
ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశాలు
అనుమతులు వచ్చిన వెంటనే వంతెన నిర్మిస్తామంటున్న అధికారులు
బుచ్చెయ్యపేట, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
మండలంలో వడ్డాది వద్ద పెద్దేరుపై వంతెన నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందా అని రెండు జిల్లాలకు చెందిన పలు మండలాల ప్రజలు మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. పూర్వకాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో మూడేళ్ల క్రితం పాక్షికంగా కూలిపోయింది. కొద్ది నెలల తరువాత పక్కనే నదిలో నుంచి కాజ్‌వే నిర్మించారు. ఇది తక్కువ ఎత్తులో వుండడంతో పెద్దేరు నదికి వరద వస్తే వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి. కొత్త వంతెన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది.
బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వద్ద పెద్దేరు నదిపై దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడం, ఆర్‌అండ్‌బీ అధికారులు నిర్వహణను పట్టించుకోకపోవడంతో 2022 మే నెల 12వ తేదీన వంతెన మధ్య భాగంలో రెండు పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో రెండు పిల్లర్లు బీటలువారాయి. దీంతో వంతెన శ్లాబ్ కుంగిపోయింది. దీంతో అధికారులు వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, అడ్డంగా ముళ్ల కంచె వేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పాదచారులను సైతం వంతెన మీదుగా వెళ్లనివ్వలేదు. వంతెన కుంగిపోవడంతో వాహనాలను వేరే మార్గాల్లోకి మళ్లించాల్సి వచ్చింది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ప్రధాన మార్గంలో ఉన్న ఈ వంతెన కూలిపోవడంతో సుమారు నెల రోజులపాటు పలు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వడ్డాది గ్రామస్థులు వడ్డాది జంక్షన్‌కు చేరుకోవాలంటే బంగారుమెట్ట, వీరవల్లి అగ్రహారం మీదుగా రావాల్సి వచ్చింది. అధికారులు స్పందించి కూలిన వంతెన ఖానాల మధ్య బండరాళ్లు, మట్టితో నింపి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, వ్యాన్లు వంటి బరువు తక్కువ వుండే వాహనాల రాకపోకలకు అనుమతించారు. కొత్త వంతెన నిర్మాణం చేపట్టే వరకు ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా వుండేందుకు పాత వంతెనకు దిగువున సుమారు కోటిన్నర రూపాయలు వెచ్చించి కాజ్‌వే నిర్మించారు. అయితే ఇది ఎత్తు తక్కువగా వుండడంతో నదిలో ఏమాత్రం వరద పెరిగినా.. కాజ్‌వే మునిగిపోతున్నది. బస్సులు, ఇతర భారీ వాహనాలను వేరే మార్గాల్లోకి మళ్లించాల్సి వస్తున్నది.
ప్రతిపాదనల్లోనే కొత్త వంతెన నిర్మాణం
వడ్డాది వద్ద కూలిన వంతెన స్థానంలో సుమారు రూ.25 కోట్లతో కొత్త వంతెన నిర్మిస్తామని అప్పట్లో ఎమ్మెల్యేగా వున్న కరణం ధర్మశ్రీ చెప్పారు. ఈ మేరకు అధికారులతో ప్రతిపాదనలు సైతం తయారు చేయించారు. కానీ ఆయన పదవిలో వున్నంత కాలం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. తాము అధికారంలోకి వస్తే వడ్డాది వద్ద కొత్త వంతెన నిర్మిస్తామని గత ఏడాది సాధారణ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 17వ తేదీన ఎంపీ సీఎం రమేశ్.. చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్.రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుతో కలిసి వడ్డాది పాత వంతెన, తాత్కాలికంగా నిర్మించిన కాజ్‌వేను పరిశీలించారు. ఇక్కడ కొత్త వంతెన ఆవశ్యకతను ఎంపీకి వారు వివరించారు. తక్షణమే ప్రతిపాదనలు చేసి పంపాలని సంబంధిత అధికారులను ఎంపీ రమేశ్ ఆదేశించారు. ఇంతవరకు ఎటువంటి పురోగతి లేదు.
కాగా వడ్డాది వద్ద పెద్దేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం గురించి ఆర్‌అండ్‌బీ ఏఈ సాయిశ్రీనివాస్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. నూతన వంతెన నిర్మాణానికి రూ.25 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని చెప్పారు. అనుమతులు మంజూరు కాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
Updated Date - Apr 19 , 2025 | 12:48 AM