టమాటా ధరకు రెక్కలు
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:27 AM
టమాటా ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
వారం రోజుల్లో రూ.12 పెరిగిన ధర
రైతుబజార్లలో కేజీ రూ.34
బహిరంగ మార్కెట్లో రూ.50
అక్కయ్యపాలెం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):
టమాటా ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రైతు బజార్లలో వారం రోజుల కిందట కేజీ ధర రూ.22 ఉండగా ప్రస్తుతం రూ.34కి చేరింది. ఇక బహిరంగ మార్కెట్లలో కేజీ రూ.50 పలుకుతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు టమాటా నిత్యావసరం. ఇప్పటికే కూరగాయల ధరలు పెరుగుతుండగా, టమాటా ధరతో జనం గగ్గోలు పెడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా టామాటా పంటకు నష్టం సంభవించిందని, ఈ నేపథ్యంలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. నగరంలోని హోల్‌సేల్ మార్కెట్‌కు మదనపల్లి నుంచి టమాటా వస్తుంది. అక్కడ 25 కిలోల క్రేట్ రూ.850 ధర పలుకుతోంది, రవాణా ఖర్చులు కలిపితే మరింత భారమని, కేజీ రూ.34కి విక్రయించినా నష్టమే వస్తోందని రైతుబజార్లలోని స్టాల్స్ నిర్వాహకులు వాపోతున్నారు.
విమ్స్‌లో సదరం పరీక్షలు
లోకో మోటార్ కేటగిరీకి బాధితులకు నిర్వహణ
విశాఖపట్నం, జూలై 6 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో సదరం శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం కేజీహెచ్‌తోపాటు మిగిలిన బోధనాస్పత్రుల్లో ఈ క్యాంపులను నిర్వహిస్తున్నారు. కాగా విమ్స్‌లో లోకో మోటార్ కేటగిరీ (శారీరక వైకల్యంతో బాధపడుతున్న వారికి) పరీక్షలు నిర్వహిస్తారు. స్లాట్ బుక్ చేసుకునే వారు ఇకపై విమ్స్‌ను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆర్థో విభాగానికి చెందిన వైద్యులను విమ్స్ అధికారులు కేటాయిం చారు. శిక్షణ పొందిన నలుగురు సిబ్బందిని కూడా నియమించారు. ప్రతి మంగళవారం క్యాంపులు నిర్వహించనున్నామని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు తెలిపారు.
Updated Date - Jul 07 , 2025 | 12:27 AM