కానరాని శతాబ్ది సందడి
ABN, Publish Date - Jul 31 , 2025 | 01:02 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల సందడేమీ కనిపించడం లేదు. దేశంలోని పురాతన విద్యా సంస్థల్లో ఒకటైన ఏయూ వందో ఏడాదిలోకి ప్రవేశించడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ వేడుకలను నిర్వహిస్తామంటూ అధికారులు ప్రకటించారు. వేడుకలకు గుర్తుగా ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇందుకోసం దాతలు, పూర్వ విద్యార్థుల సహకారాన్ని తీసుకుంటామన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మాదిరిగా నూతన భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందని పలువురు మాజీ వీసీలు సలహా ఇవ్వడంతో, ఆ మేరకు వర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
వందో వసంతంలోకి ఏయూ
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ వేడుకలు నిర్వహిస్తామంటూ
అధికారుల ప్రకటన
వందేళ్ల వేడుకలకు గుర్తుగా ఏదైనా నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రణాళిక
కార్పస్ ఫండ్ ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయం
మూడు నెలల క్రితం ఉత్సవాలు ప్రారంభం
ఆ తరువాత ఆ ఊసే లేదు
దేశ, విదేశాల్లో కీలక స్థానాల్లో పూర్య విదార్థులు వారిని సమన్వయపరిచే యంత్రాంగమే లేదు
విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల సందడేమీ కనిపించడం లేదు. దేశంలోని పురాతన విద్యా సంస్థల్లో ఒకటైన ఏయూ వందో ఏడాదిలోకి ప్రవేశించడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ వేడుకలను నిర్వహిస్తామంటూ అధికారులు ప్రకటించారు. వేడుకలకు గుర్తుగా ఏదైనా గొప్ప కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇందుకోసం దాతలు, పూర్వ విద్యార్థుల సహకారాన్ని తీసుకుంటామన్నారు. ఆంధ్ర మెడికల్ కాలేజీలో మాదిరిగా నూతన భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందని పలువురు మాజీ వీసీలు సలహా ఇవ్వడంతో, ఆ మేరకు వర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేవిధంగా వర్సిటీ భవిష్యత్తు అవసరాలకు భారీమొత్తంలో నిధులు సేకరించి కార్పస్ ఫండ్ ఏర్పాటుచేయాలని భావించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం ఆశించిన స్థాయిలో లభించే అవకాశాలు ఉండవని, కార్పస్ ఫండ్ ద్వారా వచ్చే వడ్డీతో వర్సిటీ అవసరాలు తీర్చుకోవచ్చునని అధికారులు ఆలోచించారు. నిధులు సమీకరించే ప్రక్రియను వందేళ్ల వేడుకలతోనే ప్రారంభించాలనుకున్నారు. అయితే, ఈ రెండు కీలక నిర్ణయాలకు సంబంధించి ఇప్పటివరకూ ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. వందేళ్ల వేడుకలు ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఇప్పటివరకూ ఎటువంటి పెద్ద కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించలేదు.
బాధ్యత ఎవరిది?
ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. అందులో పలువురు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అయితే, వారిని కో-ఆర్డినేట్ చేసుకుంటూ నిధులు సమీకరించే దిశగా వేదికను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర మెడికల్ కళాశాల అధికారులు వందేళ్ల వేడుకలకు ఏడాది ముందుగానే కమిటీలను ఏర్పాటు చేసుకుని నిధులను సమీకరించుకుని రూ.50 కోట్లతో సువిశాలమైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏయూ అధికారులు కూడా ఆ దిశగా ఆలోచించాలని సూచిస్తున్నారు.
పూర్వ విద్యార్థుల సంఘంతో సమన్వయం కరవు
ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం (ఏఏఏ)లో జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు సహా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అటువంటి వారి సహాయాన్ని తీసుకుని వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలి. అయితే, ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో పూర్వ విద్యార్థుల సంఘం కూడా అంటీ ముట్టనట్టుగానే ఉంటోంది. ఏటా డిసెంబరు పదో తేదీన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలను జీఎంఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశంలోని ప్రముఖులను తీసుకుని వస్తున్నారు. ఈ వేడుకలకు రతన్ టాటా, ఎల్‌అండ్‌టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీని తీసుకురావాలని జీఎంఆర్ భావించారు. ఈ మేరకు వర్సిటీ అధికారులకు సమాచారాన్ని అందించారు. అయితే, వందేళ్ల వేడుకల్లో బిజీగా ఉంటామని తెలియజేయడంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిణామాల పట్ల ఏయూ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్‌లో శతాబ్ది వేడుకలు నిర్వహిస్తున్న వాతావరణం కాన రావడం లేదంటూ పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా వర్సిటీ అధికారులు వందేళ్ల వేడు కలపై దృష్టిసారిస్తే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు.
Updated Date - Jul 31 , 2025 | 01:02 AM