మెడికల్ సర్టిఫికెట్ల మాయాజాలం!
ABN, Publish Date - May 19 , 2025 | 12:57 AM
ఉపాధ్యాయుల బదిలీల్లో కీలకమైన ప్రాధాన్యత పాయింట్ల కేటాయింపునకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- గతంలో జారీ చేసిన ధ్రువపత్రాలపై అనుమానాలు
- బోర్దు ఎదుట 442 మంది ఉపాధ్యాయులు హాజరు
- సగం మందికి 56 శాతానికి పైగా వైకల్యం లేదని నిర్ధారణ
- 160 మంది వరకు మెడికల్ బోర్డు ఎదుట హాజరు కాని వైనం
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయుల బదిలీల్లో కీలకమైన ప్రాధాన్యత పాయింట్ల కేటాయింపునకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫికెట్ల కోసం మెడికల్ బోర్డు ఎదుట హాజరైన వారిలో సగం మందికి 56 శాతం కంటే తక్కువ శాతం వైకల్యం ఉండడంతో వారు ప్రాధాన్యత కేటగిరీలోకి రారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో మెడికల్ బోర్డులు సర్టిఫికెట్ల జారీ చేసిన సమయంలో అవకతవకలు జరిగాయనే వాదన వినిపిస్తోంది. దీనికి అనుగుణంగా సుమారు 160 మంది వరకు బోర్డు ఎదుట హాజరు కాకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. ఉపాధ్యాయుల బదిలీల సమయంలో ప్రాధాన్యత పాయింట్లు ఇవ్వడం ఆనవాయితీ. ఎక్కువ ప్రాధాన్యత పాయింట్లు ఉన్నవారంతా విశాఖ నగరం, పరిసరాలు, అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న పాఠశాలల్లో పనిచేస్తున్నారు. తాజాగా జరగనున్న టీచర్ల బదిలీలకు ప్రాధాన్యత పాయింట్ల కోసం గతంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాధాన్యత పాయింట్ల కోసం టీచర్లు మరోసారి వైద్యుల ముందు హాజరు కావాలని పేర్కొనడంతో గతనెల 24, 25, 26 తేదీల్లో కేజీహెచ్, ఈఎన్‌టీ, కంటి ఆస్పత్రుల్లో నిర్వహించిన పరీక్షలకు వారు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో 600 మంది టీచర్లు 56 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్టు గతంలో మెడికల్ బోర్డుల నుంచి సర్టిఫికెట్లు తీసుకుని బదిలీల సమయంలో పాయింట్లు పొందారు. వీరిలో ఎక్కువమంది ఇప్పుడు బదిలీలు కోరుకుంటున్నారు. అందువల్ల 442 మందే వైద్య పరీక్షలకు హాజరయ్యారు. టీచర్లకు సంబంధిత వైద్యులు పరీక్షలు నిర్వహించే సమయంలో పలు రకాల రిపోర్టులను ప్రామాణికంగా తీసుకున్నారు. ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తెచ్చిన రిపోర్టులను వైద్యులు క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రతి ఉపాధ్యాయుడికి సంబంధించి వైకల్యంపై మెడికల్ బోర్డుకు రిఫర్ చేశారు. వైద్యుల ఎదుట హాజరైన ఉపాధ్యాయులందరూ ప్రాధాన్యత పాయింట్ల కోసమేనని చెప్పనక్కర్లేదు. అయితే వైద్యుల తనిఖీల అనంతరం ఆయా టీచర్ ఇబ్బందులపై రిపోర్టు రాసి మెడికల్ బోర్డుకు నివేదించారు. ఈ నివేదికల మేరకు పలువురు ఉపాధ్యాయులు ‘ప్రాధాన్యత కేటగిరీ కిందకు వస్తారని, మరికొందరు రారని బోర్డు స్పష్టం చేసింది’. కాగా కేజీహెచ్ జారీ చేసిన సర్టిఫికెట్‌లో కొన్నింటిపై చేతి రాతతో రాయడం గమనార్హం. అంటే గతంలో ఇచ్చిన రిపోర్టులో ఏమైనా తేడాలున్నాయా? లేదా అప్పటి టీచర్ల ఆరోగ్య పరిస్థితి మేరకు వైద్యులు సర్టిఫికెట్లు జారీ చేశారా.? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే కొందరి సర్టిఫికెట్ల జారీలో మాత్రం అవకతవకలు జరిగాయని గతంలో పలువురిపై ఫిర్యాదులు వచ్చాయి. గతనెలలో పరీక్షలు నిర్వహించిన వైద్యుల రిపోర్టుల మేరకు రెండు మూడు రోజుల క్రితం కేజీహెచ్, ఈఎన్‌టీ, కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్లు విశాఖ జిల్లా విద్యాశాఖాధికారికి సర్టిఫికెట్లను పంపారు. మొత్తం 442 మంది వైద్య పరీక్షలకు హాజరైతే వారిలో సగం మందే ప్రాధాన్యత కేటగిరీలోకి వస్తారని మెడికల్ బోర్డులు ధ్రువీకరించాయి. దీంతో ఈ పర్యాయం బదిలీల్లో ప్రాధాన్యత కేటగిరీలో పాయింట్లు పొంది బదిలీల్లో మంచి స్థానాలు పొందే అవకాశాన్ని కొందరు కోల్పోయారు. ఈ పర్యాయం బదిలీల్లో ఒక పాఠశాలలో 50 శాతానికి మించి ప్రాధాన్యత కేటగిరీలో టీచర్లు రాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో నగరం, పరిసరాల్లో పలు పాఠశాలలకు ఇతర కేటగిరీ టీచర్లు రానున్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
Updated Date - May 19 , 2025 | 12:57 AM