ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇళ్లు సరే.. వసతులేవీ?

ABN, Publish Date - May 26 , 2025 | 12:10 AM

నగరంలో నివసిస్తున్న గూడులేని పేదలకు నగర శివార్లలో సెంటు స్థలంలో నిర్మిస్తున్న కాలనీల్లో వసతుల కల్పన గురించి అధికారులు పట్టించుకోవడం లేదు.

  • నిర్మాణ బాధ్యతలు హౌసింగ్‌ కార్పొరేషన్‌ది

  • వీఎంఆర్డీఏకు మౌలిక వసతుల కల్పన బాధ్యత

  • జూన్‌ నెలాఖరు నాటికి 30 వేల ఇళ్ల పూర్తి లక్ష్యం

  • ఆయా కాలనీలో తాగునీరు, విద్యుత్‌, రోడ్లు వంటి సదుపాయాలు శూన్యం

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

నగరంలో నివసిస్తున్న గూడులేని పేదలకు నగర శివార్లలో సెంటు స్థలంలో నిర్మిస్తున్న కాలనీల్లో వసతుల కల్పన గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. వచ్చే నెలాఖరుకల్లా 65 కాలనీల్లో 30 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని గృహనిర్మాణ సంస్థ అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అంతేకాక జూలై తరువాత ఆయా ఇళ్లల్లో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసుకునేలా అధికారులు సమయం ఖరారు చేయనున్నారు. ఒకవేళ ఆయా ఇళ్లల్లో లబ్ధిదారులు నివాసాలను ఏర్పాటు చేసుకుంటే తాగునీరు, విద్యుత్‌, మురుగు నీటిసరఫరా, రోడ్లు వంటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇప్పటివరకు అధికారులు అటువంటి ప్రయత్నమేమీ చేయడం లేదని పలువురు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మౌలికవసతులు కల్పించేంత వరకు నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు రక్షణ ఎవరు? అనేది ఎవరూ చెప్పడం లేదు. ఇళ్ల నిర్మాణాలు, మౌలికవసతుల కల్పన విషయంలో గృహనిర్మాణ సంస్థ, వీఎంఆర్డీఏల మధ్య సమన్వయం లేదనడానికి సెంటు స్థలాల కాలనీలే నిదర్శనమని తేటతెల్లమైంది.

గత ప్రభుత్వంలో నగరంలో ఉంటున్న గూడులేని నిరుపేదలకు నగర శివార్లలో సెంటు స్థలం వంతున ప్లాట్లను కేటాయించారు. ఇందుకు వందల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం.. శివారులోని పలు మండలాల్లో 73 లేఅవుట్లను అభివృద్ధి చేశారు. అయితే కొన్నిచోట్ల నిర్మాణాలు, ఇతరత్రా సమస్యలతో పెండింగ్‌లో పెట్టగా ప్రస్తుతం 65 లేఅవుట్లలో 98 వేల ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. పైడివాడ అగ్రహారంలో 11 వేలు, నడుపూరు, గిడిజాల, నర్సాపురం, ముదపాక, తంగుడుబిల్లి, గంగవరంలో మూడు నుంచి నాలుగు వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనా పలు కారణాలతో జాప్యం జరిగింది. చివరకు గత ఏడాది నుంచి ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగడంతో ఇప్పటివరకు 16 వేల ఇళ్ల వరకు పూర్తవ్వగా, మరో 14 వేల ఇళ్లు వచ్చే నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా అధికారులు నిర్దేశించారు. కేంద్ర ప్రభుత్వం పీఎంఎవై పథకం కింద ప్రతి ఇంటికి రూ.1.8 లక్షలు మంజూరు చేసినా నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకురాలేదు. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ల ద్వారా ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. ఈనేపథ్యంలో గృహనిర్మాణ సంస్థ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు అప్పుడప్పుడు పర్యవేక్షిస్తున్నప్పుడు వసతుల గురించి సైట్‌ ఇంజనీర్లకు ప్రశ్నిస్తున్నారు.

కాగా మొత్తం 62 లేఅవుట్లలో వసతుల కల్పన బాధ్యతను వీఎంఆర్డీఏకు అప్పగించారు. గత ప్రభుత్వ హయాంలో సెంటు స్థలాల చదును చేసే బాధ్యతను వీఎంఆర్డీఏకే అప్పగించారు. భూ సమీకరణ చేసే సమయంలో పేదల ఇళ్లు, భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించగా, మిగిలిన ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ముతో కాలనీల్లో వసతులు కల్పించాలి. ఇందుకు సంబంధించి వీఎంఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధుల సమస్య వెంటాడుతుంది. అయితే పీఎంఏవై పథకంలో నిబంధన మేరకు ఇళ్ల కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రతి ఇంటికి రూ.80 వేల వరకు ఖర్చు చేయాలి. ఈ లెక్కన సుమారు రూ.1,200 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. అంత సొమ్ము ప్రస్తుతం వీఎంఆర్డీఏ వద్ద లేదనేది స్పష్టం. దీంతో టెండర్లు పిలిచేందుకు వెనుకంజ వేస్తున్నారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, యూజీడీ, పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ కేంద్రం వంటి వాటిని ఏర్పాటు చేయాలి. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన వెంటనే తొలుత తాగునీటికి ఓవర్‌హెడ్‌ ట్యాంకు, పాఠశాల, ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు చేపట్టాలి. ఉదాహరణకు 11 వేల ఇళ్లు నిర్మిస్తున్న పైడివాడ అగ్రహారంలో సుమారు పాతిక నుంచి 30 వేల మంది నివసిస్తారు. వారందరికి తాగునీరు కావాలి, ఆయా కాలనీల్లో బోర్లు వేస్తే అంత నీటి లభ్యత ఉండదు. కొన్నిచోట్ల స్థానికంగా భూగర్భ జలాల ద్వారా నీటి సరఫరా చేసినా వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టే కాలనీల్లో సాధ్యం కాదని ఇంజనీర్లు చెబుతున్నారు. దీంతో సమీపంలోని నదులు, వాగులు, పెద్ద చెరువుల నుంచి నీటిని మళ్లించడానికి పైపు లైన్లు, ఫిల్టర్‌ పాయింట్లు నిర్మించాలి. ప్రస్తుతం 62 లేఅవుట్లలో పద్మనాభం మండలంలోని నర్సాపురం తదితర లేఅవుట్లు మాత్రమే గోస్తనీ నదికి దగ్గరలో ఉన్నాయి. మిగిలిన లేఅవుట్లలో ప్రజలకు తాగునీరు ఇవ్వాలంటే ఏలేరు, రైవాడ, మేహాద్రిగెడ్డ, తాటిపూడిపై ఆధారపడాలి. అయితే ఇంతవరకు ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రతిపాదనలు లేవనే వాదన ఉంది. రోడ్లు, విద్యుత్‌, డ్రెయిన్లు వంటి వసతుల కల్పన చేయాలంటే కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందంటున్నారు. అంతవరకు పూర్తయిన ఇళ్లల్లో లబ్ధిదారులు ఎలా నివాసం ఉంటారు? ఒకవేళ వసతుల కోసం ఎదురుచూస్తే అప్పటివరకు ఇళ్లను కాపాడేది ఎవరనేది అధికారులే చెప్పాలి. కాలనీల్లో వసతుల కల్పన గురించి హౌసింగ్‌ పీడీ సత్తిబాబు వద్ద ప్రస్తావించగా.. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే పనులను వేగవంతం చేశామన్నారు. అయితే వసతుల కల్పన బాధ్యత వీఎంఆర్డీఏదేనని, దీనిపై సంబంధిత అధికారులను కలిసి కోరామన్నారు.

Updated Date - May 26 , 2025 | 12:10 AM