తీరిన గిరిజన విద్యార్థుల కష్టాలు
ABN, Publish Date - Jun 29 , 2025 | 12:34 AM
చదువు కోసం అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట శివారు సొలబొంగి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థులు పడుతున్న కష్టాలపై విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ చర్యలు తీసుకున్నారు. ఆ రెండు జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు అనకాపల్లి డీఈవో జి.అప్పారావునాయుడు, అల్లూరి జిల్లా సమగ్రశిక్ష సహాయ పథక సమన్వయకర్త (ఏపీసీ)లెఫ్ట్‌నెంట్ డాక్టర్ స్వామినాయుడుతో కూడిన అధికారుల బృందం శనివారం సొలబొంగి గ్రామానికి చేరుకున్నారు.
మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
- అతికష్టమ్మీద సొలబొంగి గ్రామానికి చేరుకున్న అధికారులు
- చదువు కోసం రోజూ పది కిలోమీటర్లు చేసే సాహస ప్రయాణానికి ముగింపు
- బాలల కష్టాలు తీర్చేలా చర్యలు
దేవరాపల్లి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) చదువు కోసం అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పినకోట శివారు సొలబొంగి గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థులు పడుతున్న కష్టాలపై విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ చర్యలు తీసుకున్నారు. ఆ రెండు జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు అనకాపల్లి డీఈవో జి.అప్పారావునాయుడు, అల్లూరి జిల్లా సమగ్రశిక్ష సహాయ పథక సమన్వయకర్త (ఏపీసీ)లెఫ్ట్‌నెంట్ డాక్టర్ స్వామినాయుడుతో కూడిన అధికారుల బృందం శనివారం సొలబొంగి గ్రామానికి చేరుకున్నారు. గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామంలో 13 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా 12 ఏళ్లలోపు వారే. మరో నలుగురు బడికి వెళ్లకుండా ఉన్నారు. వీళ్లు చదువుకోవాలంటే ఇక్కడ నుంచి కిలోమీటరు దూరం నడిచి శారదానది ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి బోటులో అర్ధగంటకు పైగా నదిలో ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరాలి. పుస్తకాల బ్యాగు మోసుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లి మండలం తామరబ్బ ప్రాఽథమిక పాఠశాలకు చేరాలి. ఇలా రోజూ పది కిలోమీటర్లు సాహస ప్రయాణం చేస్తుంటారు. వర్షాలు కురిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ వివరాలను అధికారులు సేకరించారు. అల్లూరి జిల్లా కలెక్టర్‌తో సమగ్రశిక్ష ఏపీసీ మాట్లాడారు. ఒకటి, రెండవ తరగతి చదువుతున్న 8 మంది కోసం అక్కడే చదువుకొనే విధంగా నాన్‌రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు విద్యా వలంటీర్‌ను నియమించి సెంటర్‌ను ప్రారంభించారు. మిగిలిన వారిలో మూడు నుంచి ఐదవ తరగతి చదువుతున్న ఐదుగురు బాలబాలికలను పినకోట, జీనబాడులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించడానికి కలెక్టర్ అనుమతించారు. అలాగే మధ్యలో బడి మానేసిన నలుగురిని పినకోటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. వీరభద్రపేట నుంచి సొలబొంగి వరకు రహదారి నిర్మాణ పనులను గిరిజన సంక్షేమ శాఖ ఈఈ కె.వేణుగోపాల్, ఏఈఈ గణేశ్ యుద్ధప్రాతిపదికన చేపట్టారు. అంతకు ముందు ఆ గ్రామానికి వెళ్లడానికి అధికారులు చాలా కష్టాలు పడ్డారు. బోటులో, కాలినడకన ఆ గ్రామానికి చేరుకున్నారు. వారి వెంట దేవరాపల్లి ఎంఈవో ఉషారాణి, పినకోట, తామరబ్బ సర్పంచ్ గణేషు, రామకృష్ణ, సీపీఎం నాయకుడు కె.గోవిందరావు, తదితరులు ఉన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 12:35 AM