వీడని చెత్త డంపింగ్ యార్డు కష్టాలు
ABN, Publish Date - Jun 08 , 2025 | 01:00 AM
నియోజకవర్గ కేంద్రం స్థానిక మేజర్ పంచాయతీలో చెత్త డంపింగ్ యార్డు తరలింపు అధికారులకు సంకటంగా మారింది. ఒక పక్క నివాసాల మధ్యన చెత్త డంపింగ్ యార్డుతో నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు.
- చోడవరం ఊరి మధ్యలో ఉండడంతో అవస్థలు
- తరలించాలని స్థానికుల నిరసనలు
- స్థలం ఇవ్వడానికి పరిసర పంచాయతీలు ససేమిరా
చోడవరం, జూన్ 7(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రం స్థానిక మేజర్ పంచాయతీలో చెత్త డంపింగ్ యార్డు తరలింపు అధికారులకు సంకటంగా మారింది. ఒక పక్క నివాసాల మధ్యన చెత్త డంపింగ్ యార్డుతో నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. మరో వైపు చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటుకు ససేమిరా అంటూ పరిసర పంచాయతీలు అభ్యంతరం చెబుతున్నాయి. 20 వేల మందికి పైగా జనాభా ఉన్న స్థానిక మేజర్ పంచాయతీలో సరైన చెత్త డంపింగ్ యార్డు లేదు. చీడికాడ రోడ్డులో ఉన్న శ్మశానవాటిక స్థలంలోనే పంచాయతీ సిబ్బంది చెత్త పోస్తూ వచ్చారు. కాలక్రమంలో అదే చెత్త డంపింగ్ యార్డుగా మారింది. జనాభా తక్కువగా ఉన్నప్పుడు పెద్ద సమస్యగా కనిపించని ఈ చెత్త డంపింగ్ యార్డు, పట్టణంలో జనాభా పెరిగిపోయి రెట్టింపు స్థాయిలో చెత్త పోగుపడుతుండడం, వాటిని సిబ్బంది తగులబెడుతుండడం, ఆ పొగ పరిసర కాలనీలను ముంచెత్తుతుండడంతో ఈ చెత్త డంపింగ్ యార్డును ఇక్కడ నుంచి తొలగించాలంటూ స్థానికులు పట్టుబడుతున్నారు. పట్టణంలోని 20 వార్డుల్లోని చెత్తను సింహాద్రిపురం వెళ్లే దారిలో ఉన్న చెరువు సమీపంలోనూ, స్థానిక ఐటీ కాలనీ, బాలాజీనగర్, ద్వారకానగర్‌కు ఆనుకుని ఉన్న చీడికాడ రోడ్డులోని శ్మశాన వాటికలోనూ పంచాయతీ సిబ్బంది పోస్తూ వస్తున్నారు. ఐటీ కాలనీ సమీపంలోని శ్మశానవాటికలో ఉన్న చెత్త డంపింగ్ యార్డులోనే ఎక్కువ శాతం చెత్త పోగుపడుతుండడం స్థానికులను అసహనానికి గురిచేస్తున్నది. గతంలో ఈ చెత్త డంపింగ్ యార్డు తొలగించాలంటూ స్థానికులు ఆందోళనలు చేయడంతో చెత్త డంపింగ్ యార్డు కోసం అధికారులు పలు ప్రదేశాలను గుర్తించారు. అయితే తమ పంచాయతీల పరిధిలో చెత్త డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించవద్దంటూ ఆయా పంచాయతీల నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి చేయడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. ఇటీవల కాలంలో ఐటీ కాలనీ సమీపంలో చెత్త ఎక్కువగా పోగుపడడం, డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను కాలుస్తుండడంతో విపరీతమైన పొగ పరిసర కాలనీలోని నివాసాలను చుట్టుముడుతున్నది. దీంతో వారంతా మరోసారి ఈ డంపింగ్ యార్డు పరిస్థితిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. నివాసాల మధ్యన ఉన్న ఈ డంపింగ్ యార్డులో చెత్త కాల్చడం వల్ల తమ ఆరోగ్యాలు చెడిపోతున్నాయని, దీనిని వేరే ప్రాంతానికి తరలించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ డంపింగ్ యార్డు సమస్య మరోసారి తెర మీదకు వచ్చింది. స్థానికుల డిమాండ్ల నేపథ్యంలో మరోసారి అధికారులు చెత్త డంపింగ్ యార్డుకు అవసరమైన స్థలం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
Updated Date - Jun 08 , 2025 | 01:00 AM