గంజాయి నిర్మూలనే ధ్యేయం
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:34 PM
జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించడమే ధ్యేయమని, దీనికి గానూ త్వరలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు.
త్వరలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశం ఏర్పాటు
ఏడు గంజాయి కే సుల్లోని నిందితుల రూ.10 కోట్ల ఆస్తులు జప్తు
విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి వెల్లడి
గ్రామ సచివాలయాల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలి
కలెక్టర్ దినేశ్‌కుమార్
పాడేరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయిని శాశ్వతంగా నిర్మూలించడమే ధ్యేయమని, దీనికి గానూ త్వరలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తామని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జిల్లాలో గంజాయి నిర్మూలనపై వివిధ శాఖల అఽధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. డ్రోన్‌లు, ఇతర సాంకేతికతను వినియోగించి గంజాయి సాగు ధ్వంసం చేస్తున్నామని చెప్పారు. గంజాయిపై గట్టి నిఘా పెట్టామని, సాగు చేస్తున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో గంజాయిని నిర్మూలిస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు జిల్లా మీదుగా రవాణా చేస్తున్నారని తెలిపారు. దానిని సైతం అరికట్టేందుకు త్వరలో అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయిని రవాణా చేయకుండా సరిహద్దు ప్రాంతాల్లో 26 చెక్‌పోస్టులతో తనిఖీలు చేపడుతున్నామని, ఏడు గంజాయి కేసుల్లోని స్మగ్లర్లకు చెందిన రూ.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామన్నారు. గత పదేళ్లలో 60 కేసుల్లో పది సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షలు పడ్డాయన్నారు. 45 అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలను గుర్తించామని, గంజాయి సాగు, రవాణాతో సంబంధం ఉన్న వారిపై నిఘా పెట్టామని, మత్తుకు బానిసలైన 20 మందికి విముక్తి కేంద్రాల్లో చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు.
సచివాలయాల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు
జిల్లాను గంజాయి రహితం చేసేందుకు గానూ గ్రామ సచివాలయాల స్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. గంజాయి సాగుకు దూరమైన వారికి ప్రత్యామ్నాయ పంటలను అందించాలని, గంజాయి సాగు, రవాణా వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాలయాల్లో మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే నష్టాలను యువత, విద్యార్థులకు తెలపాలన్నారు. వివిధ శాఖల అధికారులు నిర్వహించే ప్రతి సమావేశంలోనూ గంజాయి నిర్మూలనపై చర్చించాలని సూచించారు. జిల్లాను గంజాయి రహితం చేయడంలో భాగంగా గ్రామ సచివాలయాల స్థాయిలో స్మూక్ష ప్రణాళికలు తయారు చేయాలని ఆయన తెలిపారు.
18 కేసుల్లో 9,500 కిలోల గంజాయి సీజ్
జిల్లాలో గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని, గత ఐదు నెలల్లో 18 కేసుల్లో 9,500 కిలోల గంజాయిని సీజ్ చేశామని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్ధార్ తెలిపారు. గత ఏడాది సుమారుగా 348 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టు గుర్తించామని, కానీ ఈ ఏడాది కేవలం 93 ఎకరాల్లోనే సాగవుతున్నట్టు డ్రోన్ల ద్వారా గుర్తించామన్నారు. సమావేశానికి ముందు వనం- మనం, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, అడిషనల్ ఎస్‌పీ కె.ధీరజ్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, డీఎస్‌పీ షెహబాజ్ అహ్మద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జమాల్ బాషా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.హేమలత, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 05 , 2025 | 11:34 PM