మార్కెట్ యార్డును అభివృద్ధే లక్ష్యం
ABN, Publish Date - Jun 28 , 2025 | 12:48 AM
వ్యవసాయ మార్కెట్ యార్డును రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధే చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. శుక్రవారం పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం ఏఎంసీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
నర్సీపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ మార్కెట్ యార్డును రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధే చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. శుక్రవారం పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని నూతన పాలకవర్గానికి సూచించారు. పాలకవర్గం సమావేశాలకు సభ్యులంతా హాజరు కావాలని సూచించారు. గత ప్రభుత్వంలో మూతపడిన ఇక్కడి భూసార పరీక్షా కేంద్రాన్ని రెండు నెలల్లో పునఃప్రారంభించాలని ఏడీని ఆదేశించారు. మార్కెట్ యార్డులో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేయాలన్నారు. ఇంతకుముందు టీడీపీ అధికారంలో వున్నప్పుడు రైతు బజార్ కోసం కొన్ని దుకాణాలు నిర్మించామని, అదనంగా మరికొన్ని షాపులు నిర్మించి రైతు బజార్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుబజార్ ముందు ఖాళీ స్థలంలో దుకాణాలు, మార్కెట్ యార్డు ప్రవేశమార్గంలో ఉన్న ఖాళీ స్థలంలో ఓపెన్ ఆడిటోరియం నిర్మించి అద్దెకి ఇవ్వాలని, తద్వారా మార్కెట్ కమిటీకి ఆదాయం పెరుగుతుందని సూచించారు. మార్కెట్ సెస్ చెల్లించకుండా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేస్తున్న వాహనాలను చెక్‌పోస్టు వద్ద డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏఎంసీ చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశించారు. డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు మాట్లాడుతూ, కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి డీసీసీబీ ద్వారా రుణం అందిస్తానని తెలిపారు. తొలుత ఏఎంసీ చైర్మన్‌గా గవిరెడ్డి వెంకటరమణ, వైస్ చైర్మన్ చిటికెల కన్నయ్యనాయుడు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ మాట్లాడుతూ, స్పీకర్ సహాయ సహకారాలతో మార్కెట్ యార్డు అభివృద్ధి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కౌన్సిలర్లు చింతకాయల పద్మావతి, రాజేశ్, ఆర్డీవో వీవీ రమణ, మునిసిపల్ కమిషనర్ సరేంద్ర, జడ్పీటీసీ సభ్యురాలు రవణమ్మ, జనసేన నియోజకవర్గం ఇన్‌చార్జి సూర్యచంద్ర, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, తహసీల్దార్ రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2025 | 12:48 AM