ఆర్థిక వ్యవస్థకు మత్స్య పరిశ్రమ కీలకం
ABN, Publish Date - May 20 , 2025 | 01:32 AM
దేశ ఆర్థిక వ్యవస్థకు మత్స్య పరిశ్రమ అత్యంత కీలకమని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
సముద్రంలో చేపల పెంపకానికి కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు
బీచ్‌రోడ్డు, మే 19 (ఆంధ్రజ్యోతి):
దేశ ఆర్థిక వ్యవస్థకు మత్స్య పరిశ్రమ అత్యంత కీలకమని రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నగరంలోని జాలరిపేట, ఎండాడ వద్ద సముద్రంలో చేపల పెంపకానికి కేజ్ కల్చర్, కృత్రిమ ఆవాసాలు (ఆర్టిఫీషియల్ రీఫ్స్)ను సోమవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సముద్రంలో కృత్రిమ ఆవాసాలను ఏర్పాటుచేయడం వల్ల మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందన్నారు. ఉత్త రాంధ్ర జిల్లాల్లో మొదట విడతగా 22 కృత్రిమ ఆవాసాల యూనిట్లు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాల తీర ప్రాంత సముద్ర జలాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో మెకనైజ్డ్ బోట్లకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 634 ట్రాన్స్‌పాండర్స్‌ను వంద శాతం సబ్సిడీపై అందించినట్టు తెలిపారు. తుఫాన్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మత్స్యకారులకు జీపీఎస్, ఎకో సౌండర్, బోట్లు, ఇంజన్లు, వలలు, తాళ్లు వంటి పరికరాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్‌లో ఉన్న డీజిల్ సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, మత్స్య శాఖ కమిషనర్ రామ్‌శంకర్ నాయక్, మత్స్య శాఖ సహాయ సంచాలకులు పి.లక్ష్మణరావు, సీఎంఎఫ్‌ఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జోయ్‌కిన్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 20 , 2025 | 01:32 AM