నిబంధనలు పాటించకే ప్రమాదం
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:30 AM
సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం తప్పును సిబ్బంది పైకి నెట్టేసింది.
తప్పు ఉద్యోగులదేనట
ఏపీపీసీబీ చైర్మన్‌కు సాయి శ్రేయాస్ యాజమాన్యం వివరణ
ఫార్మా సిటీలోని కంపెనీ ప్రతినిధులతో అధికారుల సమావేశం
ప్రతి ఒక్కరూ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు
సిబ్బంది భద్రత పూర్తిగా యాజమాన్యమే తీసుకోవాలని సూచన
విశాఖపట్నం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి):
సాయి శ్రేయాస్ ఫార్మా కంపెనీ యాజమాన్యం తప్పును సిబ్బంది పైకి నెట్టేసింది. రెండు రోజుల క్రితం అక్కడ విష వాయువులు విడుదలై ఇద్దరు సేఫ్టీ అధికారులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య శనివారం ఆ కంపెనీని సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)ను ఉద్యోగులు పాటించలేదని, మాస్కులు ధరించలేదని అందుకే వారు చనిపోయారని వివరించారు. తప్పును చనిపోయిన వారిపైకి నెట్టడాన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. సేఫ్టీ విభాగం అసిస్టెంట్ మేనేజర్ చంద్రశేఖర్‌కు ఆ సమయంలో డ్యూటీ లేకపోయినా ఇంటి నుంచి పిలిపించి వ్యర్థాలను శుద్ధి చేసే పని అప్పగించారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో యాజమాన్యం వివరించలేదు. ఇక సాయి శ్రేయాస్ కంపెనీ నుంచి తరచూ విషవాయువులు వెలువడుతున్నాయి. ఎదురుగా ఉన్న విమల ఫార్మా కంపెనీ ప్రతినిధులు ఇదే విషయమై సాయి శ్రేయాస్ యాజమాన్యంతో తరచూ గొడవ పడుతున్నారు. విష వాయువుల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని, వాటిని నిరోధించాలని డిమాండ్ చేస్తున్నారు. తనిఖీలకు వెళ్లిన అధికారులు ఇవేవీ ప్రశ్నించకపోవడం గమనార్హం.
ఫార్మా ప్రతినిధులతో సమావేశం
ప్రమాద స్థలం పరిశీలన పూర్తయిన తరువాత ఏపీపీసీబీ చైర్మన్ కృష్ణయ్య రాంకీ ఫార్మా సిటీలో కంపెనీల ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫార్మా కంపెనీలలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, చాలామంది మరణిస్తున్నారని, వీటిని నిరోధించడానికి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి కంపెనీ తరచూ సేఫ్టీ ఆడిట్, మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఉద్యోగులకు భద్రత నియమాలు, ప్రాసెసింగ్ దశలో వ్యవహరించే తీరుపై నిరంతర శిక్షణ ఇవ్వాలన్నారు. అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్లు ధరించేలా చూడాలన్నారు. సిబ్బంది భద్రత పూర్తిగా యాజమాన్యమే తీసుకోవాలన్నారు. ప్రమాదకరమైన ఉత్పత్తుల తయారీ నైపుణ్యం కలిగిన వారి పర్యవేక్షణలోనే జరగాలన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించేందుకు నిరంతరం విజిలెన్స్ విభాగం పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ప్రసాదరావు, ఫ్యాక్టరీస్ జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 12:30 AM