ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నగరం భగభగ

ABN, Publish Date - Jul 21 , 2025 | 12:39 AM

ఆషాఢం మబ్బులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనాల్సిన నగరం కొన్ని రోజులుగా భగభగ మండుతోంది.

  • భరించలేనంత వేడి వాతావరణం

  • ఆరుబయట మాడుపగిలే తీవ్రత

  • ఉష్ణోగ్రతల నమోదుకు భిన్నంగా సెగలు

  • అర్బన్‌ హీటింగ్‌ ప్రభావమంటున్న నిపుణులు

  • మధ్యాహ్నం తరువాత కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు

విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):

ఆషాఢం మబ్బులతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనాల్సిన నగరం కొన్ని రోజులుగా భగభగ మండుతోంది. ఉదయం నుంచే నిప్పులకొలిమిలా మారుతోంది. ఎనిమిదిగంటలకే మాడుపగిలేలా ఎండ కాస్తోంది. సాయంత్రం వరకు తీవ్రత తగ్గడంలేదు. రాత్రి కూడా వాతావరణం చల్లబడడంలేదు. వేసవిలో లేనంత ఎండ ప్రభావం నెలకొనడంతో ప్రజలు భరించలేకపోతున్నారు. ఆరుబయట పనిచేయాల్సిన భవన నిర్మాణ కార్మికులు, కర్మాగారాలు, పరిశ్రమల్లో ఉద్యోగులు, కార్మికుల శ్రామికశక్తి సన్నగిల్లుతోంది. కొద్దిసేపు పనిచేసి తరువాత నీడ కోసం వెతుకులాడుతున్నారు.

వేసవికాలంలో మధ్యాహ్నం నుంచే సముద్రగాలులు నగరంపైకి వీయడంతో వాతావరణం చల్లబడేది. అందుకు భిన్నంగా వర్షాకాలంలో వాతావరణం వేడెక్కి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇళ్లల్లో ఫ్యాన్‌, ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. జూలైలో నగరంలో కొన్ని రోజులు పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీలు, మిగిలిన రోజులు 34 నుంచి 36 డిగ్రీలు వరకు నమోదయ్యాయి. అయితే అంత కంటే ఎక్కువ వేడి నెలకొంటోంది. వాతావరణ పరిభాషలో ఫీల్‌లైక్‌ టెంపరేచర్‌ (శరీరం భరించే వేడి) నమోదవుతుందని వాతావరన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా పెరుగుతోందంటున్నారు.

అర్బన్‌ హీట్‌ ఐలాండ్లు

నగరంలో లక్షలకు చేరిన వాహనాల నుంచి వచ్చే పొగ వేడికి కారణంగా చెబుతారు. నగరంలో అన్ని ప్రాంతాల్లో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. పెద్ద భవనాలు, ఆకాశహార్మ్యాల కారణంగా వేడి పెరుగుతోంది. నిర్మాణాలకు వినియోగించే సిమెంట్‌, ఐరెన్‌, కెమికల్స్‌ నుంచి మరింత వేడి పుడుతోంది. పైగా ఏసీల వినియోగం లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో అనేకచోట్ల అర్బన్‌ హీట్‌ ఐలాండ్లు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. వీటి వల్ల మరింత వేడి పుడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

పలుచోట్ల వర్షం

నగరంలో ఆదివారం ఉదయం నుంచి ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి నెలకొని మధ్యాహ్నం తరువాత పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఎన్‌ఎడీ నుంచి పెందుర్తి వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి ఏడు గంటల తరువాత నగరంలో చిరుజల్లులు కురిశాయి. సోమవారం పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Jul 21 , 2025 | 12:39 AM