దారికొస్తున్న బీఎన్ రోడ్డు
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:45 AM
నియోజకవర్గ పరిధిలోని బీఎన్ రోడ్డులో ఎట్టకేలకు గోతుల పూడ్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోడ్డు దుస్థితిపై పలువురు కోర్టులో కేసులు వేయడం, కూటమి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో పనులకు కదలిక వచ్చింది. గోతుల పూడ్చివేత పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
ఎట్టకేలకు గోతుల పూడ్చివేత మొదలు
రహదారి దుస్థితిపై కోర్టులో కేసులు, కూటమి నేతల ఒత్తిడితో పనులకు కదలిక
వాహనదారులకు ఊరట
చోడవరం, జూలై 14(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలోని బీఎన్ రోడ్డులో ఎట్టకేలకు గోతుల పూడ్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోడ్డు దుస్థితిపై పలువురు కోర్టులో కేసులు వేయడం, కూటమి ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి రావడంతో పనులకు కదలిక వచ్చింది. గోతుల పూడ్చివేత పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారి పనులు ప్రారంభమై బిల్లులు మంజూరుకాక అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మండలంలోని చోడవరం- అనకాపల్లి రోడ్డులోని గంధవరం నుంచి నర్సీపట్నం శివారు రోలుగుంట వరకు రోడ్డు పూర్తిగా గోతులమయంగా తయారుకావడంతో వాహనాలు ప్రయాణించడానికి కూడా వీల్లేని విధంగా పరిస్థితి మారింది. రావికమతం మండలం మేడివాడ వద్ద తరచూ ఆటోలు, జీపులు ఇతర లారీలు, బస్సులు కూరుకుపోవడం, ఎక్స్‌కవేటర్లతో బయటకు లాగడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇక బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట నుంచి వడ్డాది, వడ్డాది నుంచి చోడవరం మండలం వరకు విజయరామరాజుపేట, లక్ష్మీపురం కళ్లాలు, గోవాడ, అంభేరుపురం, వెంకన్నపాలెం జంక్షన్ల వద్ద రోడ్డు దారుణంగా తయారైంది. తరచూ ఈ రోడ్డులో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు దుస్థితి మెరుగుపరచాలని, కనీసం గోతులైనా పూడ్చాలని స్థానిక నాయకులు, వివిధ వర్గాల ప్రజలు వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ రోడ్డు పనులు చేపట్టాలంటూ స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు, మాడుగుల ఎమ్మెల్యే బండారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌తో పాటు జనసేన నేతలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రోడ్డు దుస్థితిపై ఇటీవల స్థానిక న్యాయవాదులు కోర్టులో కేసు వేయడం, దీనిపై కోర్టు కలెక్టర్, ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులను ఈ నెల 26న కోర్టుకు హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం సంచలనం రేపింది. ఇదే సమయంలో బీఎన్ రోడ్డు పరిస్థితిపై స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ఇతర న్యాయవాదులు కూడా మరో నాలుగు కేసులు వేయడంతో ఈ రోడ్డుపై దాఖలైన కేసుల సంఖ్య ఐదుకి చేరింది. ఇలా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు, కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి కూడా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో బీఎన్ రోడ్డు పనుల్లో కదలిక వచ్చింది. ప్రస్తుతం ప్రధాన గోతులన్నీ గత రెండు రోజులుగా పూడుస్తున్నారు. వడ్డాది జంక్షన్ నుంచి రావికమతం వరకు, అలాగే వడ్డాది నుంచి చోడవరం వరకు గల పెద్ద గోతుల్లో మెటల్ వేసి రోలర్‌తో చదును చేస్తున్నారు. దీనిపై సిమెంట్ పూత వేస్తారని అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డులో పెద్ద గుంతలను తాత్కాలికంగానైనా కప్పుతుండడంతో వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ ర్షాకాలం కావడంతో ఈ పూడ్చివేత పనులు తాత్కాలికంగా కాకుండా, రోడ్డు పనులు పూర్తయ్యే వరకు నిలిచేలా పక్కాగా ఉండేలా చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:45 AM