ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉలిక్కి పడిన మన్యం

ABN, Publish Date - May 08 , 2025 | 01:00 AM

జీకేవీధి- వై.రామవరం సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

అడవుల్లో గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు(ఫైల్‌)

జీకేవీధి-వై.రామవరం సరిహద్దు ప్రాంతాల్లో ఎదురుకాల్పులు

మావోయిస్టు అగ్ర నేతలు జగన్‌, రమేశ్‌ మృతి

మూడేళ్ల తరువాత మళ్లీ ఎన్‌కౌంటర్‌

సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్తత

కొనసాగుతున్న గాలింపు చర్యలు

చింతపల్లి, మే 7: జీకేవీధి- వై.రామవరం సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మూడేళ్ల తరువాత మళ్లీ ఎకౌంటర్‌ జరగడం, సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఇద్దరు మరణించడంతో సరిహద్దు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. సీపీఐ మావోయిస్టు పార్టీ అవిర్భావం 2024 సెప్టెంబరు 21 నుంచి తూర్పుగోదావరి, ఉమ్మడి విశాఖ సరిహద్దు ప్రాంతాలు తూర్పుకనుములు(ఈస్టు డివిజన్‌ కమిటీ) పరిధిలో ఉండేవి. తూర్పుకనుముల్లో గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలు మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాయి. వరుస ఎదురుకాల్పులు, మావోయిస్టు క్యాడర్‌, మిలీషియా దళ సభ్యుల లొంగుబాట్లు వల్ల గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలు నిర్వీర్యమైపోయాయి. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు సరిహద్దు ప్రాంతాలు ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ పరిధిలో ఉన్నాయి. ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో పోలీసు నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టు పార్టీలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో ఉంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2017 నవంబరులో రామ్‌గఢ్‌ ఎదురుకాల్పుల్లో ఒకేసారి 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో గణేశ్‌తో పాటు పలువురు సెంట్రల్‌ కమిటీ సభ్యులు మృతి చెందారు. నాటి నుంచి మావోయిస్టు పార్టీలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. సురక్షిత ప్రాంతంగా పేరొందిన తూర్పుకనుముల ప్రాంతానికి మావోయిస్టులు అతిథుల్లా వచ్చి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

మూడేళ్ల తరువాత మళ్లీ ఎన్‌కౌంటర్‌

ఏవోబీ సరిహద్దు తూర్పుకనుముల్లో మూడేళ్ల తరువాత మళ్లీ ఎన్‌కౌంటర్‌ జరగడం చర్చనీయాంశంగా మారింది. 2022 సెప్టెంబరులో సీపీఐ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సమయంలో ధారకొండ సరిహద్దు నేలజర్త అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో సీపీఐ మావోయిస్టు ఏసీఎం, డీసీఎం ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌ మావోయిస్టులు నలుగురు మృతి చెందారు. నాటి నుంచి తూర్పుకనుముల్లో మావోయిస్టుల కార్యక్రమాలు పెద్దగా కనిపించలేదు. బుధవారం వె.ౖరామవరం మండలం శేషరాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్మలవాడ గ్రామానికి చెందిన ఏవోబీ ఎస్‌జెడ్‌సీ సభ్యుడు జగన్‌ అలియాస్‌ కాకూరి పండన్న, ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఏవోబీ ఎస్‌జెడ్‌సీ సభ్యుడు రమేశ్‌ మృతి చెందడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పక్కా సమాచారంతో కూంబింగ్‌

ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో పోలీసుల నిర్బంధం పెరిగిపోయింది. వరుస ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తూర్పుకనుముల్లోనూ మావోయిస్టు పార్టీని బలోపేతం చేయాలని 20 రోజుల క్రితం సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు వచ్చాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారంతో వారిని లక్ష్యంగా చేసుకుని గ్రేహౌండ్స్‌, ఏపీఎస్పీ ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఏప్రిల్‌ 28వ తేదీన కొయ్యూరు సరిహద్దు కంఠవరం, కాకులమామిడి గ్రామాల్లో పోలీసులు, మావోయిస్టులు ఎదురు పడడంతో రెండు సార్లు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మవోయిస్టులు తప్పించుకున్నారు. దీంతో తప్పించుకున్న మావోయిస్టుల కోసం సరిహద్దు అడవులను ప్రత్యేక పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. బుధవారం వై.రామవరం శేషరాయి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు అగ్ర నేతలు మృతి చెందారు.

అడవులు జల్లెడ

సీపీఐ మావోయిస్టు పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక పోలీసు బలగాలు సరిహద్దు అడవులను జల్లెడ పడుతున్నాయి. ప్రధానంగా రంపచోడవరం, చింతూరు, పాడేరు డివిజన్ల సరిహద్దు అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. రెండు వారాలుగా సరిహద్దు గిరిజన గ్రామాల్లో పోలీసులు, మావోయిస్టుల బూట్ల శబ్ధంతో దద్దరిల్లుతున్నాయి. దీంతో ఆదివాసీలు ఏ క్షణంలో ఎటువంటి హింసాత్మక సంఘటన చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. శేషరాయి ఎన్‌కౌంటర్‌తో ఆదివాసీలు భయాందోళన చెందుతున్నారు.

Updated Date - May 08 , 2025 | 01:00 AM