’పది’ గట్టెక్కించేలా!
ABN, Publish Date - May 05 , 2025 | 12:29 AM
గతనెలలో విడుదలైన పదోతరగతి ఫలితాల్లో పరీక్ష తప్పిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ దృష్టిసారించింది.
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
జిల్లాలో 3,485 మంది పరీక్ష తప్పిన విద్యార్థులు
తరగతులకు 40 శాతం మందే హాజరు
19 నుంచి అడ్వాన్స్‌డ్ సప్ల్లిమెంటరీ పరీక్షలు
విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):
గతనెలలో విడుదలైన పదోతరగతి ఫలితాల్లో పరీక్ష తప్పిన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ దృష్టిసారించింది. ఈనెల 19నుంచి జరగనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫెయిలైన విద్యార్థులకు సన్నద్ధం చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో జిల్లాలోని 11 మండలాల్లో 22 ఉన్నత పాఠశాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
గత నెలలో విడుదలైన ఫలితాల్లో జిల్లాలో 3,485 మంది పరీక్ష తప్పారు. వీరందరినీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేలా సిద్ధం చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలలో తరగతులు నిర్వహించడం కష్టమైన పని కావడంతో ప్రధాన కూడళ్లలో ఉన్నత పాఠశాలలను ఎంపికచేశారు. ఆ పాఠశాలకు సమీపంలో మూడు, నాలుగు పాఠశాలల ఉపాధ్యాయులకు విధులు అప్పగించారు. ప్రతి రోజు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు సబ్జెక్టులపై బోధించి, సాయంత్రం పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో అధికంగా 200 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలతోపాటు సమీపంలో మరో రెండుమూడు పాఠశాలల విద్యార్థులకు కలిపి తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే 40 శాతం మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారు. ఈవారం నుంచి హాజరు సంఖ్య పెరిగేలా చూడాలని హెచ్‌ఎంలను డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ ఆదేశించారు. ప్రతి రోజు ఒకటిలేదా రెండు ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీచేస్తున్నారు. పరీక్షలకు వీలుగా విద్యార్థులను సన్నద్ధంచేయాలని, సందేహాలుంటే నివృత్తిచేయాలని టీచర్లకు సూచించారు. కాగా ఈనెల 19వతేదీ నుంచి 12 కేంద్రాల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని డీఈవో తెలిపారు.
Updated Date - May 05 , 2025 | 12:29 AM