టార్గెట్ మలేరియా
ABN, Publish Date - May 16 , 2025 | 12:41 AM
రానున్న రెండేళ్ల కాలంలో మలేరియాను పూర్తిగా నివారించడానికి జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో పలురకాల కార్యక్రమాలు చేపడతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇచ్చిన పిలుపుతో 2027 నాటికి మలేరియా కేసులను సున్నాకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా మలేరియా ప్రబలడానికి కారణమయ్యే దోమల నివారణ, పారిశుధ్యం మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.
2027నాటికి ‘జీరో కేసుల’ నమోదే లక్ష్యం
జిల్లాలో 108 గ్రామాల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలు
ఇంటి లోపల, గోడల మీద మందు పిచికారీ
ఇప్పటికే మొదటి విడత స్ర్పేయింగ్ పూర్తి
జూన్ ఒక టి నుంచి రెండో విడత...
అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో మందు పిచికారీ
జిల్లాలో 2023లో 175, 2024లో 259 మలేరియా కేసులు నమోదు
ఈ ఏడాది మే 11 నాటికి 120 మంది బాధితులు
నర్సీపట్నం, మే 15 (ఆంధ్రజ్యోతి): రానున్న రెండేళ్ల కాలంలో మలేరియాను పూర్తిగా నివారించడానికి జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో పలురకాల కార్యక్రమాలు చేపడతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇచ్చిన పిలుపుతో 2027 నాటికి మలేరియా కేసులను సున్నాకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా మలేరియా ప్రబలడానికి కారణమయ్యే దోమల నివారణ, పారిశుధ్యం మెరుగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు.
వర్షాకాలంలో పారిశుధ్యలోపం, దోమల పెరుగుదల కారణంగా ఏటా జూన్ నుంచి డిసెంబరు వరకు మలేరియా కేసులు అధికంగా నమోదు అవుతుంటాయి. గిరిజన గ్రామాలు, వాటిని ఆనుకొని మైదాన గ్రామాల్లో మలేరియా కేసులు అధికంగా నమోదు అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను ఆనుకుని వున్న మండలాల్లోని గిరిజన గ్రామాలతోపాటు వాటికి సమీపంలో వున్న మైదాన గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దేవరాపల్లి, చీడికాడ, వి.మాడుగుల, రావికమతం, రోలుగుంట, గొలుగొండ, నాతవరం, కోటవురట్ల మండలాలలో ఎంపిక చేసిన గ్రామాల్లో మలేరియా నిర్మూలను చర్యలు తీసుకుంటున్నారు. గత మూడు సంవత్సరాల్లో నమోదైన మలేరియా కేసులను ప్రామాణికంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాల్లో ఇండోర్ రెసిడ్యూల్ స్ర్పేయింగ్ (ఐఆర్‌ఎస్) చేపట్టారు. ఇందులో భాగంగా రెండు విడతలుగా దోమల నివారణా చర్యలు తీసుకుంటున్నారు.
108 గ్రామాలలో ఐఆర్‌ఎస్
అనకాపల్లి జిల్లాలో ఎంపిక చేసిన 108 గ్రామాల్లో దోమల నివారణకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఐఆర్‌ఎస్ నిర్వహిస్తున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో మొదటి విడత స్ర్పేయింగ్ పూర్తి చేశారు. జూన్ ఒకటో నుంచి రెండో విడత స్ర్పేయింగ్ మొదలు పెట్టనున్నారు. జిల్లాలోని 135 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో కూడా జూన్ రెండో వారం నుంచి దోమల నివారణ మందును పిచికారీ చేస్తారు.
ఏటా పెరుగుతున్న మలేరియా కేసులు
జిల్లాలో 2023 జనవరి నుంచి డిసెంబరు వరకు 175 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మరో 84 కేసులు పెరిగి మొత్తం 259 కేసులు నమోదు అయ్యాయి. ఈ సంవత్సరం మే 11వ తేదీనాటికి 120 మంది పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
అవరోధంగా మారిన పారిశుధ్యలోపం
మలేరియాను నిర్మూలించాలన్న లక్ష్యానికి పారిశుధ్యలోపం అవరోధంగా మారింది. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడంతో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండి పోయి దోమల బెడద అధికమవుతున్నది. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో వర్షం నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండి పోవడం, వాడి పారేసిన ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, కప్పులు, కొబ్బరి బోండాలు, పాత టైర్లులో ఎకువ రోజులు వర్షం నీరు వుంటే దోమలు వృద్ధి చెందుతున్నాయి.
లక్ష్య సాధనకు....
జిల్లాలో ఎంపిక చేసిన 108 గ్రామాల్లో ప్రతి ఇంటిలో అన్ని గదుల్లో, బయట గోడలపైన రెండు సార్లు దోమల నివారణ మందును పిచికారీ చేస్తారు.
జిల్లాలోని 134 బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో జూన్ నెలలో ఒకసారి దోమల నివారణ మందును స్ర్పే చేస్తారు.
చెరువులు, నీటి నిల్వలు ఉన్న చోట ఎంఎల్‌ఓ ఆయిల్ బాల్స్ వేస్తారు.
మలేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తారు.
ప్రజలు ఏం చేయాలి...
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి
ఇంటి పరిసరాలు, శ్లాబ్‌పైన, సన్ షేడ్స్ మీద నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి
వాటర్ ట్యాంకులు, కుండీలపై మూతలు పెట్టుకోవాలి
సెప్టిక్ ట్యాంకు గొట్టాలకు నైలాన్ జాలీలను కట్టుకోవాలి
వాడేసిన ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, గ్లాసులను డ్రైనేజీ కాలువల్లో వేయకూడదు
2027నాటికి ‘జీరో మలేరియా కేసులు’ లక్ష్యం
వరహాలదొర, జిల్లా మలేరియా అధికారి (15ఎన్‌పీ3)
దోమల కారణంగానే మలేరియా జ్వరాలు ప్రబలుతాయి. అందువల్ల ప్రజలు నివాసాలు, పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. 2027 నాటికి ‘జీరో మలేరియా కేసులు’ టార్గెట్‌గా పెట్టుకుని పని చేస్తున్నాము. ఎంపిక చేసిన గ్రామాల్లో మొదటి విడత దోమల నివారణ మందు పిచికారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూన్‌లో రెండో విడత చేపడతాం వసతిగృహాల్లో కూడా దోమల నివారణా చర్యలు తీసుకుంటున్నాం.
Updated Date - May 16 , 2025 | 12:41 AM