‘సుఖీభవ’ సాయం సద్వినియోగం చేసుకోండి
ABN, Publish Date - Aug 02 , 2025 | 11:23 PM
వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
కలెక్టర్ దినేశ్‌కుమార్
బ్యాంకులో జమ కాకుంటే 155251 నంబర్‌కు ఫోన్ చేయండి
మూడేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధి
పాడేరు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్’ తొలి విడత ఆర్థిక సాయం జమ సందర్భంగా శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంపై అధారపడి జీవిస్తున్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే లక్ష్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతలుగా ప్రతి ఏడాది రూ.20 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. ఈఏడాది తొలి విడతగా జిల్లా వ్యాప్తంగా 1లక్షా 44వేల 222 మంది రైతులకు రూ.101 కోట్ల 84 లక్షలు లబ్ధి చేకూరుతుందన్నారు. తక్షణమే రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జమ కాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటువంటి సమస్యలుంటే కాల్ సెంటర్ 155251 నంబర్‌కు సమాచారం ఇస్తే పరిష్కరింస్తారన్నారు. రైతులకు సొమ్ము జమ కాని పరిస్థితులపై అధికారులు దృష్టి సారించి, వారికి సొమ్ము జమయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ సూచించారు. అలాగే గిరిజన ప్రాంతంలో రానున్న మూడేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆర్గానిక్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ మాట్లాడుతూ... అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ సాయాన్ని రైతులు వినియోగించుకుని చక్కని ప్రయోజనం పొందాలన్నారు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన అరకులోయ ఇన్‌చార్జి వంపూరు గంగులయ్య, ఏఎంసీ చైర్‌పర్సన్ మచ్చల మంగతల్లి, పలువురు రైతులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1 లక్షా 44 వేల 222 మంది రైతులకు రూ.101 కోట్ల 84 లక్షల లబ్ధి చేకూరే నమూనా చెక్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్, రైతు సాధికారత సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎల్.భాస్కరరావు, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, జడ్పీటీసీ సభ్యురాలు కిముడు గాయత్రి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ఏపీ టూరిజం డైరెక్టర్ కిల్లు వెంకటరమేశ్‌నాయుడు, సర్పంచులు కొట్టగుళ్లి ఉషారాణి, పాండురంగస్వామి, టీడీపీ నేతలు, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Aug 02 , 2025 | 11:23 PM