ఏయూలో విద్యా విభాగం మనుగడ ప్రశ్నార్థకం
ABN, Publish Date - May 20 , 2025 | 01:39 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యంత కీలకమైన వాటిల్లో విద్యా విభాగం ఒకటి.
మూడేళ్ల కిందట విద్యా భవన్ నుంచి తాత్కాలికంగా హెచ్‌ఆర్‌ఎం విభాగానికి మార్పు
అదే ఇప్పుడు బీఈడీ (స్పెషల్), ఎంఈడీ కోర్సుల నిర్వహణకు ఇబ్బందిగా మారిన వైనం
ఆయా కోర్సులు కొనసాగాలంటే వసతులతో కూడిన భవనం కీలకం
ఈ ఏడాది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, ఆర్‌సీఐ నుంచి బృందాలు తనిఖీకి వచ్చే అవకాశం
అదే జరిగితే మౌలిక వసతులు లేవని కోర్సులు రద్దు చేసే ప్రమాదం
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అత్యంత కీలకమైన వాటిల్లో విద్యా విభాగం ఒకటి. ఈ విభాగంలో బీఈడీ, ఎంఈడీతోపాటు రెండేళ్ల క్రితం వరకూ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సును నిర్వహిస్తూ వచ్చారు. ఈ కోర్సులకు భారీగా డిమాండ్ ఉంటోంది. ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు. అటువంటి కోర్సుల నిర్వహణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వర్సిటీలో గత అధికారులు తీసుకున్న నిర్ణయం ఆ విభాగం రద్దుకు కారణమయ్యేలా ఉంది.
డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఎంఈడీ, బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ (అంధుల కోసం), ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సులను నిర్వహించేవారు. ఈ కోర్సుల నిర్వహణకు సువిశాలమైన విద్యా భవన్ అందుబాటులో ఉండేది. అత్యాధునిక క్లాస్ రూమ్‌లతోపాటు ల్యాబ్‌లు, లైబ్రరీ, సెమినార్ హాల్స్, హెడ్, ఫ్యాకల్టీ రూమ్స్ ఉండేవి. అయితే, మాజీ వీసీ ప్రసాదరెడ్డి ఒకరోజు అకస్మాత్తుగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ విభాగ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అక్కడ మహిళల వసతి గృహాన్ని నిర్వహిస్తామని, తాత్కాలికంగా హెచ్‌ఆర్‌ఎం విభాగాన్ని నిర్వహించే భవంతిలోకి వెళ్లాలని సూచించారు. దాంతో విభాగానికి చెందిన ఫ్యాకల్టీ, సిబ్బంది అత్యవసరంగా విద్యా విభాగాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. తాత్కాలికంగా అన్నారు కాబట్టి మళ్లీ విభాగాన్ని అక్కడకు మార్చుతారేమోనని అనుకున్నారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా అధికారులు ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కోర్సుల నిర్వహణకు ఇబ్బందిగా ఉందని, ఆ భవనాన్ని తమకు కేటాయించాలని కోరినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు...చివరకు ఆ విభాగంలో నిర్వహించే కోర్సులు రద్దు చేసే పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్‌లో నిర్వహించే బీఈడీ (అంధుల కోసం) స్పెషల్ కోర్సుకు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్‌సీఐ) అనుమతి ఇస్తుంది. అలాగే, ఎంఈడీ కోర్సు నిర్వహించాలంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) అనుమతి అవసరం. ఈ కోర్సుల నిర్వహణకు ఆయా సంస్థలు అనుమతి ఇవ్వాలంటే తప్పనిసరిగా విభాగానికి సంబంధించిన వివరాలను అందించాలి. క్లాస్ రూమ్స్, సెమినార్ హాల్స్, లైబ్రరీ, ఫ్యాకల్టీ రూమ్‌లకు సంబంధించిన సమాచారం మెజర్‌మెంట్ ప్రకారం అందించాలి. ఆయా ఫొటోలను జియో ట్యాగింగ్ చేసి పంపించాలి. అప్పుడే ఏటా కోర్సుల నిర్వహణకు అనుమతి లభిస్తుంది. గడిచిన రెండేళ్లుగా విద్యా భవన్‌లోని వివరాలనే విభాగానికి చెందిన అధికారులు ఆయా సంస్థలకు అందిస్తున్నారు. ఈ ఏడాది తనిఖీలకు వచ్చే అవకాశం ఉండడంతో ఫ్యాకల్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం హెచ్‌ఆర్‌ఎం విభాగంలో నిర్వహిస్తున్న గదులు, ఫ్యాకల్టీ రూములు, ఇతర సదుపాయాలను చూస్తే కోర్సుల నిర్వహణను ఆయా సంస్థలు ఉపసంహరించుకునే ప్రమాదం ఉందని, అదే జరిగితే పదుల సంఖ్యలో విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడల్ట్ ఎడ్యుకేషన్ రద్దు..
ఎడ్యుకేషన్ విభాగంలో నిర్వహించే మూడు కోర్సుల్లో ఒకటైన అడల్ట్ ఎడ్యుకేషన్‌ను మాజీ వీసీ ప్రసాదరెడ్డి 2022-23 విద్యా సంవత్సరంలో రద్దు చేశారు. వసతి లేదన్న కారణాన్ని చూపించి కోర్సు రద్దు చేశారు. 30 సీట్లతో నడిచే ఈ కోర్సును రద్దు కావడంతో ఎంతోమందికి అన్యాయం జరిగింది. ఈ కోర్సు నిర్వహణకు యూజీసీ నుంచి నిధులు కూడా వస్తాయి. అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సు రద్దు చేయడంతో దీనికి కేటాయించిన ఒక డైరెక్టర్, రెండు ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రద్దయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. సకాలంలో వర్సిటీ అధికారులు స్పందించకపోతే ప్రస్తుతం నిర్వహిస్తున్న ఎంఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సులు రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే సుమారు 80 సీట్లను విద్యార్థులు నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు..
ఏయూలో 1970-71 కాలంలో విద్యా విభాగాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ లంకపల్లి బుల్లయ్య విద్యా భవన్‌ను ప్రారంభించి ఆ భవనంలోనే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటుచేశారు. అంతటి ప్రాధాన్యం కలిగిన ఈ విభాగం ఉన్నతాధికారులు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.
Updated Date - May 20 , 2025 | 01:39 AM