పల్ల్లెల్లోనూ నిఘా నేత్రాలు
ABN, Publish Date - Apr 28 , 2025 | 12:53 AM
గ్రామాల్లో నిఘా నేత్రాల ఏర్పాటు దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ప్రశాంతతకు నిలయమైన ఉండే గ్రామాల్లో క్రమేపీ అటువంటి వాతావరణం తగ్గుతుండడం, మద్యం మత్తులో గొడవపడి, కొట్లాటకు దిగుతున్న ఘటనలు పెరగడం, చోరీలు, ఇతర నేరాలు అధికం కావడంతో గ్రామాల్లో పల్లెల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాల్లో కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. చోడవరం మండలంలో వెంకన్నపాలెం, రాయపురాజుపేట, నరసయ్యపేట, ఖండేపల్లి, కన్నంపాలెం పంచాయతీల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మిగిలిన పంచాయతీల్లో సైతం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు.
నేరాలు, అల్లర్ల నియంత్రణ దిశగా పోలీసులు అడుగులు
ప్రతి పంచాయతీలో కనీస నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు
ప్రజాప్రతినిధులు, నాయకులకు పోలీసుల అవగాహన
ఉత్సవాలకు అనుమతులకు.. సీసీ కెమెరాలతో లింకు
చోడవరం, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిఘా నేత్రాల ఏర్పాటు దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. ప్రశాంతతకు నిలయమైన ఉండే గ్రామాల్లో క్రమేపీ అటువంటి వాతావరణం తగ్గుతుండడం, మద్యం మత్తులో గొడవపడి, కొట్లాటకు దిగుతున్న ఘటనలు పెరగడం, చోరీలు, ఇతర నేరాలు అధికం కావడంతో గ్రామాల్లో పల్లెల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ప్రతి గ్రామంలో ముఖ్యమైన ప్రదేశాల్లో కనీసం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. చోడవరం మండలంలో వెంకన్నపాలెం, రాయపురాజుపేట, నరసయ్యపేట, ఖండేపల్లి, కన్నంపాలెం పంచాయతీల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మిగిలిన పంచాయతీల్లో సైతం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు.
చోడవరం పోలీసు సర్కిల్ పరిధిలోని లక్కవరం గ్రామంలో ఇటీవల ఓ వృద్ధురాలిని బంగారం కోసం ఓ యువకుడు దారుణంగా పొడిచి చంపాడు. గోవాడలో సైతం బంగారం కోసం హత్య జరిగింది. ఇంకా పీఎస్‌పేట, చోడవరంలోని బాలాజీనగర్, శేమునాపల్లి, తదితర గ్రామాల్లో చోరీలు జరిగాయి. మరోవైపు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, గంజాయి తాగడం వంటివి అధకం అయ్యాయి. ఈ క్రమంలో మందుబాబుల మధ్య మాటామాటాపెరిగి గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయి. యువకులు బైక్ రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. లక్కవరంలో వృద్ధురాలి హత్య కేసును ఛేదించి, నిందితుడిని గుర్తించడానికి పోలీసులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఏకంగా నాలుగు పోలీసు బృందాలు, నెల రోజులకుపైగా కష్టపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతంలో, గవరవరం వద్ద ఓ దుకాణదారుడు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాతోపాటు, చోడవరం సమీపంలోని రేవళ్లు వద్ద ఓ నేత ఇంటివద్ద ఉన్న సీసీ కెమెరా వల్ల నిందితుడు ఎవరనేది పోలీసులు గుర్తించగలిగారు. దీంతో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరస్థులను సులభంగా పట్టుకోవడవంతోపాటు, అనవసర వివాదాలు, కొట్లాటలు, అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఉండదన్న ఉద్దేశంతో పోలీసులు ఆ దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రతి గ్రామంలో కీలక ప్రాంతాల్లో కనీసం నాలుగు అయినా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పలు పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. చోడవరం మండలం వెంకన్నపాలెం, రాయపురాజుపేట, నరసయ్యపేట, ఖండేపల్లి, కన్నంపాలెం పంచాయతీల్లో ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, మిగిలిన పంచాయతీల్లో సైతం ఏర్పాటుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు. ఖండేపల్లిలో 15 సీసీ కెమెరాలను కీలక ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. వెంకన్నపాలెంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. చోడవరం శివారు గాంధీగ్రామంలో 10 కెమెరాలు బిగించారు.
ఉత్సవాలకు అనుమతులతో లింకు
గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు చాలా రోజులుగా నాయకులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నా పెద్దగా స్పందన రాలేదు. దీంతో సీసీ కెమెరాల ఏర్పాటకు సరికొత్త ఆలోచన చేశారు. గ్రామాల్లో ఏటా అమ్మవార్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తుంటారు. భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఇందుకోసం పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. సీసీ కెమెరాల ఏర్పాటు ఆలోచనను ఈ సందర్భంగా అమలు చేయడం ప్రారంభించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే.. ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇస్తామంటూ మెలిక పెట్టారు. దీనితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి నాయకులు ముందుకు వస్తున్నారు.
సీసీ కెమెరాలతో పలు విధాలా మేలు
సీఐ పి. అప్పలరాజు, చోడవరం
సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల గ్రామాల్లో శాంతిభద్రతలు మెరుగుపడతాయి. దొంగల సంచారం తగ్గుతుంది. మందుబాబులు అనవసరంగా గొడవలకు దిగరు. మొత్తం మీద నేరాలు తగ్గుతాయి. ఒక వేళ నేరాలు జరిగినా.. నిందితులను గుర్తించి త్వరగా పట్టుకోవడానికి వీలవుతుంది. చోడవరం పట్టణంలో మా సొంత సొమ్ముతో 20 కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోనికి తీసుకుని వచ్చాం. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాం.
Updated Date - Apr 28 , 2025 | 12:53 AM