అన్నదాతలకు అండగా..
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:52 AM
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో మెలకువలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు వారంలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, అధిక దిగుబడుల సాధనకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. దీంతో అన్నదాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సత్ఫలితాలు ఇస్తున్న ‘పొలం పిలుస్తోంది’
రైతుల చెంతకు అధికారులు, శాస్త్రవేత్తలు
పంటల సాగులో ఆధునిక పద్ధతులు, అధిక దిగుబడుల సాధనపై సలహాలు, సూచనలు
వారంలో రెండు రోజులపాటు నిర్వహణ
ఇప్పటికే 254 గ్రామాల్లో పూర్తి
సంతప్తి వ్యక్తం చేస్తున్న రైతులు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగులో మెలకువలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు వారంలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, అధిక దిగుబడుల సాధనకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు. దీంతో అన్నదాతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు (2014-19) సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రైతులకు పంట సాగులో సూచనలు, సలహాలు అందించేందుకు వ్యవసాయ, ఉద్యావన శాఖలు ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీనిలో భాగంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామాల్లోకి వెళ్లి రైతులతో ముఖాముఖి మాట్లాడేవారు. వారి సాధక బాధకాలను విని, వాటిని పరిష్కరించేందుకు పలు సలహాలు ఇచ్చేవారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఎంతో ఉపయోగపడడంతో గత ఏడాది సీఎం చంద్రబాబు నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. ఈ కార్యక్రమం ద్వారా ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు, అధిక దిగుబడుల సాధన, చీడపీడల నివారణకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. గత నెల 17వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వారంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులతో కలిసి బృందాలుగా ఏర్పడి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి మంగళ, బుధవారాల్లో ఆయా గ్రామాలను సందర్శిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అనుసరించాల్సిన నూతన పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు. శాస్త్రవేత్తలు సాంకేతికపరమైన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి, రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 254 గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఆగస్టు నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా వ్యవసాయాధికారి బి.మోహన్‌రావు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. రైతులు వ్యవసాయాధికారుల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయం వృథా కాకుండా ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 12:52 AM