ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సందిగ్ధంలో చెరకు రైతు

ABN, Publish Date - Jun 09 , 2025 | 01:28 AM

జిల్లాలోనే కాదు.. యావత్‌ రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక చక్కెర కార్మాగారం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ సభ్య రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

వచ్చే క్రషింగ్‌ సీజన్‌పై స్పష్టత ఇవ్వని గోవాడ షుగర్స్‌ యాజమాన్యం

అగమ్యగోచరంగా ఫ్యాక్టరీ భవిష్యత్తు

మాటలకే పరిమితమైన డిస్టిలరీ/ ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు

చెరకు సాగుపై రైతుల్లో మీమాంస

చోడవరం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోనే కాదు.. యావత్‌ రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న ఏకైక చక్కెర కార్మాగారం గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ సభ్య రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జూన్‌ రెండో వారం వచ్చినా, రానున్న క్రషింగ్‌ సీజన్‌పై ఇప్పటి వరకు యాజమాన్యం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో చెరకు సాగు చేపట్టాలా? వద్దా? అనే విషయంలో ఫ్యాక్టరీ అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో రైతులు డోలాయమానంలో వున్నారు.

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో 25 వేల మంది సభ్య రైతుల కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా చెరకు సాగు చేస్తూ వస్తున్నారు. కాలక్రమంలో చెరకుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటిస్తున్న మద్దతు అరకొరగా వుండడం, మరోవైపు చెరకు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకుకు యాజమాన్యం సకాలంలో చెల్లింపులు జరపకపోవడంతో పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఈ కారణాల వల్ల గత కొన్నేళ్ల నుంచి గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతూ వస్తున్నది. ఒకప్పుడు సీజన్‌లో ఐదు లక్షల టన్నుల చెరకు క్రషింగ్‌ జరిగిన ఫ్యాక్టరీలో.. ఇప్పుడు లక్ష టన్నులకు పడిపోయింది. చాలామంది రైతులు చెరకు సాగుకు స్వస్తిపలికి, సరుగుడు, ఇతర పంటలు వేసుకుంటున్నారు. అయినప్పటికీ ఫ్యాక్టరీ పరిధిలో 12,500 హెక్టార్లలో చెరకు సాగు చేస్తున్నారు. గత సీజన్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే సీజన్‌లో చెరకు క్రషింగ్‌ జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తూనే కార్సీ తోటలను కొనసాగిస్తున్నారు... కొత్తగా మొక్క తోటలు (చెరకు నాట్లు) వేస్తున్నారు. చెరకు సాగుపై రైతుల్లో మక్కువ ఉన్నప్పటికీ, క్రషింగ్‌పై ఫ్యాక్టరీ యాజమాన్యపరంగా ఎలాంటి భరోసా లేదు. ఫలితంగా కొంతమంది రైతులు చెరకు సాగుపై ఇప్పటికీ సందిగ్ధంలోనే వున్నారు. గత సీజన్‌లో వివిధ రకాల కారణాల వల్ల క్రషింగ్‌కు పలుమార్లు అంతరాయం ఏర్పడిది. ముక్కుతూ.. మూలుగుతూ లక్షా తొమ్మిది వేల టన్నుల చెరకు క్రషింగ్‌ జరిగింది. ఫ్యాక్టరీలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా, క్రషింగ్‌ సాఫీగా సాగి వుంటే రైతులు కనీసం రెండు లక్షల టన్నుల చెరకును సరఫరాచేసి వుండేవారన్నది నిర్విదాంశం. కనీస ప్రోత్సాహం లేనప్పటికీ.. రైతులు ఈ స్థాయిలో చెరకు సరఫరా చేసేందుకు సిద్ధంగా వున్నారంటే.. ఫ్యాక్టరీ నుంచి పూర్తి సహాయ సహకారాలు వుంటే మూడు లక్షల టన్నుల వరకు చెరకు సరఫరా చేసే అవకాశం వుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి కనీస స్పందన లేకపోవడంతో చెరకు సాగుపై రైతులకు భరోసా కొరవడింది. ఫలితంగా చెరకు సాగు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో డిస్టిలరీ ఏర్పాటు చేస్తామని కూటమికి చెందిన అనకాపల్లి ఎంపీ, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తున్నారు. అయితే అది ఎప్పటికి సాకారం అవుతుందన్న దానిపై స్పష్టత కొరవడింది. వాస్తవానికి డిస్టిలరీ లేదా ఇథనాల్‌ ప్లాంట్‌ ప్రారంభించాలంటే షుగర్‌ ఫ్యాక్టరీని రన్నింగ్‌లో ఉంచుతూ, చెరకుతోపాటు ఇతర పంటలు పండించేలా రైతులను సమాయత్తం చేయాలి. అధికారులు, పాలకులు ఈ దిశగా చర్యలు చేపడితేనే గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మనుగడ సాధ్యం అవుతుందని రైతులు, కార్మికులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వపరంగా, ప్రజాప్రతినిధుల పరంగా యాజమాన్యం నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో గోవాడ భవితవ్యంపై చెరకు రైతుల్లో నెలకొన్న అనుమానాలకు నివృత్తి లభించదు. ఈ అనిశ్చితికి తెరదించాల్సిన బాధ్యత అధికార పార్టీ ప్రజాప్రతినిధులపైనే వుంది.

Updated Date - Jun 09 , 2025 | 01:28 AM