బురద దారిలో బిక్కుబిక్కుమంటూ...
ABN, Publish Date - Jul 30 , 2025 | 12:13 AM
మండలంలోని కృష్ణంపాలెం పంచాయతీ పరిధిలోని పులిగుమ్ము, చుట్టుగెడ్డ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా తయారైంది. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలకు సాగించడానికి ఈ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
అధ్వానంగా పులిగుమ్ము, చుట్టుగెడ్డ గ్రామాల రహదారి
పడి లేస్తూ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు
భయం భయంగా అంగన్‌వాడీ కేంద్రాలకు వెళుతున్న గర్భిణులు, బాలింతలు
ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న రోడ్డు సమస్య
ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం
మాడుగుల, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కృష్ణంపాలెం పంచాయతీ పరిధిలోని పులిగుమ్ము, చుట్టుగెడ్డ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా తయారైంది. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలకు సాగించడానికి ఈ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ద్విచక్ర వాహనాలు కూడా రాకపోకలు సాగించే అవకాశం లేకుండా ఉందని వాహనచోదకులు వాపోతున్నారు.
మండలంలోని కృష్ణంపాలెం పంచాయతీ పరిధిలోని పులిగుమ్ము, చుట్టుగెడ్డ గ్రామాల్లో సుమారు 200 మంది జనాభా ఉన్నారు. అయితే కృష్ణంపాలెం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్డు గోతులతో అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయంగా తయారైంది. దీంతో రోగులను ఆస్పత్రికి తరలించాలన్నా, ఫలసాయాన్ని కృష్ణంపాలెంలో విక్రయించాలన్నా ఈ రెండు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రెండు గ్రామాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులు కృష్ణంపాలెం, కాశీపురం పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరంతా బురదలో నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గర్భిణులు, బాలింతలు యలంపాడు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే గెడ్డ దాటాలి. వర్షాలు కురుస్తున్నప్పుడు వీరు వెళ్లలేని పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కురిస్తే ఈ రెండు గ్రామాల ప్రజలు మట్టి రోడ్డులో వెళ్లే అవకాశం లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ గ్రామాలకు పక్కా రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు.
Updated Date - Jul 30 , 2025 | 12:13 AM