ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెట్టు కింద చదువులు

ABN, Publish Date - May 27 , 2025 | 11:01 PM

మండలంలోని శరభన్నపాలెం పంచాయతీ సరమండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 39 సంవత్సరాలుగా చెట్టు కిందే చదువులు సాగిస్తున్నారు. ఈ పాఠశాల ఏర్పాటైనప్పటి నుంచి భవన సదుపాయం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

చెట్టు కింద కొనసాగుతున్న సరమండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఫైల్‌)

39 ఏళ్లుగా భవనం లేని సరమండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల

వర్షాలు కురిస్తే స్కూల్‌కు సెలవు

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

బడి ఈడు పిల్లలు చదువుకు దూరం

పట్టించుకోని అధికారులు

కొయ్యూరు, మే 27(ఆంధ్రజ్యోతి): మండలంలోని శరభన్నపాలెం పంచాయతీ సరమండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 39 సంవత్సరాలుగా చెట్టు కిందే చదువులు సాగిస్తున్నారు. ఈ పాఠశాల ఏర్పాటైనప్పటి నుంచి భవన సదుపాయం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. వర్షాలు పడినప్పుడు ఈ పాఠశాలకు సెలవే. అధికారులు కనీసం రేకుల షెడ్డు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సరమండ గ్రామానికి 1986లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంజూరు చేశారు. అయితే ఎటువంటి భవన సదుపాయం కల్పించలేదు. ఈ గ్రామంలో పీవీటీజీ తెగకు చెందిన సుమారు 25 కుటుంబాలు నివాసముంటున్నాయి. వీరంతా పూరిపాకల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామంలో బడి ఈడు పిల్లల సంఖ్య అధికంగా ఉండడంతో 39 సంవత్సరాల క్రితం అప్పటి అధికారులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతీ విద్యా సంవత్సరంలో సుమారు 20 మందికి పైబడి విద్యార్థులు ప్రాథమిక విద్యను దాటి ప్రాథమికోన్నత విద్యకు వెళుతున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల్లో 21 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక టీచరు మాత్రమే ఉన్నారు. పాఠశాలకు భవనం సమకూర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది.

దద్దుగుల గ్రామంలోని బాలలు చదువుకు దూరం

ఈ పాఠశాలకు కూతవేటు దూరంలో దద్దుగుల గ్రామం ఉంది. ఈ గ్రామంలో సుమారు 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ బడి ఈడు పిల్లలు 15 మంది ఉన్నారు. కానీ ఈ గ్రామంలో పాఠశాల లేదు. బడి ఈడు పిల్లలను సరమండ పాఠశాలకు పంపిద్దామనుకుంటే అక్కడ చెట్టు కింద చదువులు కొనసాగుతుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడం లేదు. దీంతో బాలలు చదువుకు దూరమవుతున్నారు. ఈ రెండు గ్రామాల్లోని పరిస్థితిపై ఇటీవల మీ కోసం కార్యక్రమంలో కొందరు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ స్పందించి అక్కడి పరిస్థితిని పరిశీలించి నివేదక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు. డీఈవో ఆదేశాల మేరకు స్థానిక ఎంఈవో రాంబాబు ఫిబ్రవరి 10న సరమండ గ్రామాన్నిసందర్శించి గత 39 సంవత్సరాలుగా అక్కడ పాఠశాలకు భవనం లేదని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఇచ్చి మూడు నెలలు కావస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరో 16 రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభంకానున్నది. ఈ విద్యా సంవత్సరంలో కూడా పిల్లలకు చెట్టు కింద చదువులు తప్పేటట్టు లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కనీసం తాత్కాలికంగా రేకుల షెడ్డు అయినా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - May 27 , 2025 | 11:01 PM