పాఠశాలలకు విద్యార్థి కిట్లు
ABN, Publish Date - Jun 06 , 2025 | 01:01 AM
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎనిమిది వస్తువులతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు జిల్లాలకు చేరాయి.
కిట్‌లో బ్యాగ్, యూనిఫారం క్లాత్, షూ, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు...
స్కూళ్లు తెరిచేరోజున పంపిణీ
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 72,727 మంది...
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఎనిమిది వస్తువులతో కూడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్లు జిల్లాలకు చేరాయి. వాటిని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. స్టూడెంట్ కిట్‌లో బ్యాగ్, మూడు జతల యూనిఫారం కోసం క్లాత్, షూ, రెండు జతల సాక్సులు, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఆక్స్‌ఫర్డ్ లేదా పిక్టోరియల్ డిక్షనరీ, బెల్టు ఉంటాయి.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకూ బాలురు 33,930 మంది, బాలికలు 38,697 మంది...మొత్తం 72,627 మంది ఉన్నారు. విశాఖ రూరల్ (చినగదిలి)లో 12,475 మంది, గోపాలపట్నం మండలంలో 8,618 మంది, విశాఖ అర్బన్‌లో 8,365 మంది, భీమునిపట్నంలో 8,014 మంది, సీతమ్మధారలో 7,512, పెందుర్తిలో 7,102, గాజువాకలో 6,224, ఆనందపురంలో 4,239, పెదగంట్యాడలో 3,664, పద్మనాభంలో 3257, ములగాడ మండలంలో 3,148 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతులను బట్టి మూడు సైజులలో కిట్లు సరఫరా చేశారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ పిక్టోరియల్ డిక్షనరీ, ఆరో తరగతి నుంచి ఆక్స్‌ఫర్డు డిక్షనరీ అందజేస్తారు. యూనిఫారానికి సంబంధించి క్లాత్ ఇస్తారు. విద్యార్థులు కుట్టించుకోవాలి. టైలర్ మజూరీ ఖర్చు విద్యార్థి తల్లుల ఖాతాకు ప్రభుత్వం జమచేస్తోంది. కాగా జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. ప్రేమ్‌కుమార్, సమగ్రశిక్షా అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, సీఎంవో దేముడుబాబు జిల్లాలో స్టాకు పాయింట్ల వద్ద కిట్లు పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో నాసిరకం బ్యాగులు పంపిణీ చేయడంతో నెల, రెండు నెలల్లో జిప్‌లు ఊడిపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం, నాణ్యమైన బ్యాగుల సరఫరాపై దృష్టిసారించింది. ఈనెల 12న పాఠశాలల పునఃప్రారంభం రోజున తల్లిదండ్రుల కమిటీలతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల తొమ్మిదో తేదీ నుంచి ఉన్నత పాఠశాలల్లో స్కూలు రెడీనెస్ కార్యక్రమం నిర్వహిస్తామని డీఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు.
Updated Date - Jun 06 , 2025 | 01:01 AM