అటకెక్కిన విమ్స్ అప్‌గ్రేడేషన్
ABN, Publish Date - Mar 28 , 2025 | 12:09 AM
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు.
కార్యరూపం దాల్చని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామన్న హామీ
రూ.250 కోట్లతో ఆరు బ్లాకులు నిర్మిస్తామని ప్రకటించిన గత వైసీపీ ప్రభుత్వం
నిధులు ఇతర అవసరాలకు మళ్లించడంతో ముందుకుసాగని పనులు
అప్‌గ్రేడ్ చేస్తే అందుబాటులోకి పీజీ మెడికల్ కళాశాల
పెరగనున్న వైద్యులు, సిబ్బంది
పడకల సంఖ్య 800కు పెరిగే అవకాశం
విశాఖపట్నం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో విమ్స్‌ను ఏర్పాటుచేశారు. అయితే, ఆస్పత్రి ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అప్‌గ్రేడేషన్ ప్రక్రియ ముందుకు కదల్లేదు. గత ప్రభుత్వం విమ్స్ అప్‌గ్రేడేషన్‌కు రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిధులతో కొత్తగా ఆరు బ్లాకులను నిర్మిస్తామని ప్రకటించింది. అయితే, ఆ నిధులను ఇతర అవసరాలకు బదలాయించడంతో అప్‌గ్రేడేషన్ ప్రారంభం కాలేదు.
పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటు
తొలిదశలో సాధారణ, రెండో దశలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అ ందించే ఉద్దేశంతో విమ్స్‌ను ఏర్పాటుచేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలంటే పీజీ మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. కాలేజీ ఏర్పాటైతే నెఫ్రాలజీ, ఎండోక్రైనాలజీ, యూరాలజీ, గ్యాస్ర్టో ఎంట్రాలజీ, న్యూరాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో విభాగానికి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, రెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరవుతాయి. వీటితోపాటు ఏటా ఆయా విభాగాలకు సంబంధించిన రెండు పీజీ సీట్లు వస్తాయి. దీనివల్ల రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది.
టెండర్లు పూర్తి
మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం విమ్స్ అప్‌గ్రేడేషన్‌లో భాగంగా కొత్తగా ఆరు బ్లాకులు నిర్మిస్తామని ప్రకటించింది. ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించింది. ఆ పనులు చేపట్టేందుకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసింది. అయితే, తరువాత ఆ నిధులను ఇతర అవసరాలకు వినియోగించడంతో అప్‌గ్రేడేషన్‌ను పూర్తిగా పక్కన పెట్టేసింది.
పూర్తిస్థాయిలో సేవలకు..
ప్రస్తుతం విమ్స్‌లో 30కుపైగా విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. వీటిలో పది వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ వైద్యులు కాంట్రాక్టు, డిప్యూటేషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అదే అప్‌గ్రేడేషన్ పూర్తయి సూపర్ స్పెషాలిటీ అభివృద్ధి చేస్తే పూర్తిస్థాయి వైద్యులు ఉంటారు. అలాగే, అప్‌గ్రేడేషన్ వల్ల ప్రస్తుతం ఉన్న పడకల సంఖ్య 450 నుంచి 800కు పెరుగుతుంది. శాశ్వత సిబ్బంది నియామకం అవుతారు. ప్రస్తుత ప్రభుత్వమైనా అప్‌గ్రేడేషన్‌పై దృష్టిసారించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు.
భారీగా రోగులు..
ప్రస్తుతం విమ్స్‌కు ప్రతిరోజూ 800 మంది వరకూ వచ్చి సేవలు పొందుతున్నారు. మరో 200 నుంచి 250 మంది వరకూ ఐపీ (ఇన్‌పేషెంట్) సేవలు పొందుతున్నారు. 45 మంది వైద్యులు, 202 మంది స్టాఫ్ నర్సులు, మరో 300 మంది వరకు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు.
Updated Date - Mar 28 , 2025 | 12:09 AM