ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉక్కులో బిక్కుబిక్కు

ABN, Publish Date - May 24 , 2025 | 01:29 AM

స్టీల్‌ ప్లాంటులో ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

వరుస ప్రమాదాలతో కార్మికుల్లో ఆందోళన

ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులను కుదించడంతో అనేక విభాగాల్లో సిబ్బంది కొరత

నామమాత్రంగా సాగుతున్న నిర్వహణ పనులు

అదే తరచూ ప్రమాదాలకు కారణమనే వాదన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ ప్లాంటులో ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. యాజమాన్యం ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ అనేక విభాగాలను అతి తక్కువ సిబ్బందితో నడుపుతోంది. నిర్వహణ పనులు నామమాత్రంగానే చేస్తున్నారు. దాంతో ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. ప్రమాదం జరిగిన ప్రతిసారి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది.

తాజాగా స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)-2లో హైడ్రాలిక్‌ ఆయిల్‌ లీక్‌ అయి అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. అక్కడ ఉత్పత్తి ఆగిపోయింది. ఆయిల్‌కు బదులుగా గ్యాస్‌ లీకై ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తంచేశాయి. నిర్వహణ పనులకు అవసరమైనంత సిబ్బందిని సమకూర్చకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు వస్తున్నాయి. వారం రోజుల ముందు 300 టన్నుల హాట్‌ మెటల్‌ నేలపాలైంది. ఇది ఆపరేషన్లలో వైఫల్యం వల్లనే జరిగింది. నైపుణ్యం కలిగిన సిబ్బంది లేకపోవడం వల్ల అప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం సింటర్‌ ప్లాంటులో కన్వేయర్‌ బెల్ట్‌ కూలిపోయి భారీనష్టం వాటిల్లింది. బెల్ట్‌పై పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించకపోవడం వల్ల బరువును తట్టుకోలేక బెల్ట్‌ కిలోమీటరు పొడవున తెగింది. ఇది కూడా నిర్వహణ లోపమే. తాజాగా శుక్రవారం జరిగిన ప్రమాదం గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌లు వివరాలు తెలుసుకున్నారు. ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబునాయుడుకు తెలియజేశారు. మంచి అధికారులను నియమిస్తే తప్ప ఇక్కడ పరిస్థితులు చక్కబడే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది.

ప్రస్తుతం నడుస్తున్న రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లకు తోడు జూన్‌ 20 నుంచి మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను కూడా ఆపరేషన్‌లోకి తేవాలని యత్నిస్తున్నారు. అయితే ప్లాంటులో అవసరమైనంత సిబ్బంది లేరు. దాదాపు 1,200 మంది ఉద్యోగులను వీఆర్‌ఎస్‌లో పంపించేశారు. ఓ 300 మంది వరకు రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. ఇటీవల కాంట్రాక్టు కార్మికులు 2,500 మందిని తొలగించారు. ఇంకో 1,500 మంది తీసేయడానికి జాబితా సిద్ధం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ కార్మికులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. వచ్చే నెలలో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ప్రారంభించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవలసి ఉండగా, ఉన్నవారిని తొలగిస్తే ఉత్పత్తి ఎలా సాధ్యమనేది ఆలోచించడం లేదు.

కొత్త వారికి గేటు పాస్‌లు

ఈ మూడు రోజులు విధులకు హాజరుకాకుండా సమ్మెలో పాల్గొన్న కాంట్రాక్టు కార్మికులను తక్షణమే తొలగించాలని యాజమాన్యం కాంట్రాక్టర్లను ఆదేశించింది. వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని సూచించింది. వారికి వెంటనే గేటుపాస్‌లు ఇస్తామని పేర్కొంది. కొత్తగా పనులకు వచ్చేవారికి ఏ అనుభవం ఉండదని, వారితో ఏమి పనులు చేయించుకుంటామని విభాగాధిపతులు వాపోతున్నారు. ఇంకెన్ని ప్రమాదాలు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


ఎస్‌ఎంఎస్‌-2లో అగ్ని ప్రమాదం

కేబుళ్లు, యంత్ర సామగ్రి దగ్ధం

ఉక్కుటౌన్‌షిప్‌, మే 23 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులోని స్టీల్‌ మెల్ట్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌)-2 విభాగంలో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేబుళ్లు, యంత్ర సామగ్రి దగ్ధం కావడంతో ఉత్పత్తి నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో నాలుగు కంటిన్యూ కాస్టింగ్‌ మెషీన్లు (సీసీఎం) ఉంటాయి. మూడింటిలో నిరంతరం ఉత్పత్తి సాగుతుంటుంది. ఒకటి స్టాండ్‌ బై గా ఉంటుంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు యథావిధిగా ఉత్పత్తి జరుగుతుండగా రెండో మెషీన్‌కు సంబంధించిన ట్యాంకు నుంచి హైడ్రాలిక్‌ ఆయిల్‌ను ఇతర భాగాలకు సరఫరా చేసే పైప్‌ లీకైంది. అత్యంత వేడిగా ఉండే హైడ్రాలిక్‌ ఆయిల్‌ కింద ఉన్న కేబుళ్లపై పడడంతో పెద్దఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్‌ సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో కేబుళ్లు, హైడ్రాలిక్‌ హోస్‌పైపులు కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు విభాగానికి విద్యుత్‌ సరఫరా ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని ఉద్యోగులు తెలిపారు. ఇదిలావుండగా ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని, ఎటువంటి ఉత్పత్తి, ప్రాణ నష్టం జరగలేదని, అతి తక్కువ సమయంలో మళ్లీ పునరుద్ధరణ చర్యలు చేపట్టామని ఉక్కు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - May 24 , 2025 | 01:29 AM