ఉక్కు యాజమాన్యం కక్ష సాధింపు
ABN, Publish Date - May 27 , 2025 | 01:44 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం కార్మికులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది.
మరో 1,480 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు సన్నద్ధం
సమ్మెలో పాల్గొంటున్న వారితో జాబితా తయారీ
నేడు అడ్మిన్ కార్యాలయం ముట్టడికి కార్మిక సంఘాల పిలుపు
గత నెలలో 1,731 మంది తొలగింపు
మరో వేయి మందికి గేట్ పాస్‌లు నిలిపివేత
విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం కార్మికులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్లాంటులో మొత్తం 13,250 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా, వారిలో 33 శాతం మందిని తొలగించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఏప్రిల్ నెలలో 1,731 మందిని తొలగించింది. కాంట్రాక్టు కాలం పూర్తయిన మరో వేయి మందికి గేట్ పాస్‌లు ఇవ్వకుండా గాలిలో ఉంచింది. మరో రెండు వేల మంది తీసేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అయితే యాజమాన్యం ఏదో ఒక కారణం చూపించి తమను తొలగించడానికి చూస్తున్నదని తెలుసుకున్న చాలామంది సమ్మెలో పాల్గొనకుండా విధులకు వెళుతున్నారు. 25 నుంచి 30 శాతం మంది మాత్రమే సమ్మె చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గింది. ప్రతిరోజు రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా 14 వేల టన్నుల హాట్ మెటల్ తయారవుతుండగా, శనివారం ఇది పది వేల టన్నులకు పడిపోయింది. కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకూడదని యాజమాన్యం ఇతర శాశ్వత ఉద్యోగులకు ఆఫీసర్లతో సహా 8 గంటలకు బదులు 12 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించి, షిఫ్టులు వేస్తోంది. అయితే కాంట్రాక్టు కార్మికుల పనులను అధికారులు చేయలేకపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది. దీనిని భరించలేని యాజమాన్యం సోమవారం రాత్రి మరో 1,480 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు తయారుచేసింది. అవి ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. వారిలో గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న వారితో పాటు వారికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘ నాయకులు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో వారు మంగళవారం అడ్మిన్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇది ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అవసరమైన పోలీసు బందోబస్తును యాజమాన్యం సమకూర్చుకుంది.
చర్చలు విఫలం
గత నెలలో కాంట్రాక్టు కార్మికులను తొలగించినపుడు పెద్దఎత్తున ఆందోళన చేశారు. యాజ మాన్యంతో చర్చలు జరిగాయి. మే నెల 20వ తేదీ వరకు కార్మికులను తొలగించబోమని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ తరువాత తొలగింపునకు చర్యలు చేపట్టడంతో వారు సమ్మెకు దిగారు. తాజాగా సోమవారం నగరంలో కార్మిక శాఖ అధికారుల వద్ద ఇరువర్గాలకు చర్చలు జరిగాయి. ఇలా చర్చలు జరిగేటప్పుడు జనరల్ మేనేజర్ స్థాయి అధికారి హాజరవుతారు. సోమవారం మాత్రం మేనేజర్ స్థాయి కలిగిన జూనియర్ అధికారిని యాజమాన్యం పంపించింది. యాజమాన్యాన్ని ఒప్పించే స్థాయి ఆ అధికారికి లేదని గుర్తించిన కార్మిక శాఖాధికారి...ఆయన్ను వెనక్కి పంపించేశారు. దాంతో చర్చలు విఫలమయ్యాయి.
కొనసాగుతున్న కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె
ఉక్కుటౌన్‌షిప్, మే 26 (ఆంధ్రజ్యోతి):
కాంట్రాక్టు కార్మికులను తొలగించరాదనే ప్రధాన డిమాండ్‌తో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. అయితే గడిచిన ఏడు రోజులతో పోల్చితే సోమవారం విధులకు హాజరైన కార్మికుల సంఖ్య కొద్దిగా పెరిగింది. స్వయంగా అధికారులే ఫోన్ చేస్తుండడం, విధులకు హాజరుకాకుంటే గేటు పాస్‌లు రద్దు చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరిస్తుండడంతో కొందరు కార్మికులు విధులకు హాజరయ్యారు. ఏదిఏమైనా యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు విధులకు హాజరుకావద్దని కార్మిక నాయకులు సూచిస్తున్నారు.
Updated Date - May 27 , 2025 | 01:44 AM