ఉక్కు లాభాలబాట
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:42 AM
స్టీల్ ప్లాంటు కష్టకాలంలోను రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లతో ఏప్రిల్‌లో రూ.78 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
ఏప్రిల్ నెలలో రూ.78 కోట్లు..
మే నెలలో కాంట్రాక్టు కార్మికుల సమ్మె ఎఫెక్ట్
పనులు చేయకుండానే జీతాలు తీసుకుంటున్న 1,800 మందిని తొలగించాం
మరో ఐదు వేల మంది అదనంగా ఉన్నారు
‘ఆర్’ కార్డుదారులకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తున్నాం
సీఎంకు వివరించిన యాజమాన్యం
నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశం
ప్లాంటు సక్రమంగా నడిచేలా పర్యవేక్షించే బాధ్యత ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులకు అప్పగింత
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటు కష్టకాలంలోను రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లతో ఏప్రిల్‌లో రూ.78 కోట్ల లాభాన్ని ఆర్జించింది. మే నెలలో కూడా లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నప్పటికీ...నెలాఖరున కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగడంతో దాని ప్రభావం కొంత పడిందని యాజమాన్యం చెబుతోంది. ఇటీవల కాంట్రాక్టు కార్మికులు వరుసగా రెండు రోజుల పాటు అడ్మిన్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. మహానాడు కోసం కడపలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయం తెలుసుకొని జిల్లా కలెక్టర్ ద్వారా స్టీల్ ప్లాంటులో ఏమి జరుగుతున్నదో తెలుసుకున్నారు. ఆ తరువాత సీఎండీ, ఇతర అధికారులు ఇక్కడి నుంచి కడప వెళ్లి ప్లాంటులో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్యాకేజీ, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, నీటి పన్ను, ఆస్తి పన్ను తదితరాలు మినహాయింపు ద్వారా చేసిన రూ.2 వేల కోట్ల సాయంతో ప్లాంటును లాభాల బాటలోకి తీసుకువచ్చామని వారు వివరించారు. అవసరానికి మించి కాంట్రాక్టు కార్మికులు ఉన్నారని, వారి సంఖ్య తగ్గిస్తేనే ప్లాంటుకు లాభాలు వస్తాయని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంటు కోసం తమ నివాస స్థలాలను ఇచ్చి నిర్వాసితులుగా మారిన ‘ఆర్’ కార్డుదారులకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తున్నామని వివరించారు. ప్లాంటులో వివిధ యూనియన్లు సమాంతర వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని అవసరం లేకపోయినా కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను పెంచుకుంటూ పోయాయని, వారిలో 1,800 మంది కార్మికులు అసలు పనులు చేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని, అందుకే వారిని తొలి దశలో తొలగించామని వివరించారు. మరో 300 మందికి ‘యు’ కార్డులు ఉన్నాయని, వారు సంఘాల నాయకులుగా చలామణి అవుతూ ఎటువంటి విధులు నిర్వహించకుండానే జీతాలు పొందుతున్నారని, దాంతో వారి కార్డులు కూడా నిలిపివేశామని సీఎంకు చెప్పారు. ఇంకా అదనంగా ఐదు వేల మంది కార్మికులు ఉన్నారని, వారిని కూడా దశల వారీగా తొలగిస్తే అదనపు వ్యయాలు తగ్గి ప్లాంటుకు లాభాలు వస్తాయన్నారు. ప్లాంటులో ఉత్పత్తి పెంచి తద్వారా వచ్చిన ఆదాయంతోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎంకు కర్మాగారం అధికారులు తెలిపారు. కేంద్రం రూ.11,440 కోట్లు ఇచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడానికి కారణం అదేనన్నారు. ఇలా సాయంగా వచ్చిన నిధులు జీతాలకు ఖర్చు చేసుకుంటూపోతే ప్లాంటు ఎన్నటికీ కష్టాల నుంచి బయటపడదని, అందుకే ‘పనిచేస్తేనే జీతాలు’ అనే విధానంతో ముందుకువెళుతున్నామని పేర్కొన్నారు.
సమ్మె చేస్తున్నది ఎవరు?
కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయం అంటూ కొందరు ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారని, వారంతా పనిచేయకుండా జీతాలు తీసుకున్నవారని, అందుకే వారికి కష్టంగా ఉంటోందని అధికారులు చెప్పినట్టు తెలిసింది. డ్యూటీ ప్రకారం పనిచేస్తున్న వారంతా విధులకు హాజరవుతున్నారని, సమ్మెలో పాల్గొనడానికి ఎవరూ లేకపోవడంతో కొన్ని సంఘాలు పారిశుధ్య కార్మికులను తీసుకువచ్చి ఆందోళన చేయిస్తున్నాయని, వారి ఆందోళనలో అర్థం లేదని చెప్పినట్టు తెలిసింది.
నిర్వాసితులకు నష్టం తేవద్దు
నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంటును లాభాల బాటలోకి తేవడానికి ఢిల్లీలో అనేక ప్రయత్నాలు చేసిన మీదట ఆ సాయం అందిందని, అది దుర్వినియోగం కాకూడదని, అదే సమయంలో కార్మికులలో అసంతృప్తి పెరగకుండా, భూములు ఇచ్చిన నిర్వాసితులకు అన్యాయం జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించినట్టు తెలిసింది. స్టీల్‌ప్లాంటు సక్రమంగా నడిచేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులకు అప్పగించినట్టు సమాచారం. స్టీల్ యాజమన్యంతో సమన్వయం చేసుకుంటూ ఉత్పత్తి పెరిగేలా, తద్వారా లాభాలు వచ్చేలా చూడాలని చెప్పినట్టు తెలిసింది.
Updated Date - Jun 01 , 2025 | 12:42 AM