ఏయూలో స్టేషనరీ కుంభకోణం
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:10 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అవసరమైన స్టేషనరీ కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. గత పాలకులు టెండర్లు లేకుండా ఎంపిక చేసిన సంస్థల నుంచే ఇప్పటికీ వర్సిటీ అధికారులు స్టేషనరీ కొనుగోలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
వైసీపీ హయాంలో టెండర్లు లేకుండానే కొన్ని సంస్థలకు స్టేషనరీ సరఫరా కాంట్రాక్టులు
అది కూడా మార్కెట్ రేటు కంటే ఎక్కువకు...
అస్మదీయులకు మేలు చేసేందుకు గల పాలకుల అడ్డగోలు నిర్ణయాలు
పాలకులు మారినా నేటికీ అదే సంస్థలు కొనసాగింపు
రూ.లక్షల్లో దుర్వినియోగం
మంత్రికి ఫిర్యాదులు
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అవసరమైన స్టేషనరీ కొనుగోలులో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. గత పాలకులు టెండర్లు లేకుండా ఎంపిక చేసిన సంస్థల నుంచే ఇప్పటికీ వర్సిటీ అధికారులు స్టేషనరీ కొనుగోలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వర్సిటీలో వివిధ విభాగాలకు పేపర్స్, పరీక్షల నిర్వహణకు అవసరమైన ఆన్సర్ షీట్స్, ఓఎంఆర్ షీట్స్, క్లాత్ లైన్డ్ కవర్స్, పెన్నులు, వైట్ పేపర్స్ వంటివి అవసరం. వాటి కోసం సాధారణంగా టెండర్లు పిలుస్తుంటారు. అయితే, గడిచిన ఐదేళ్లుగా టెండర్లు లేకుండానే ఈ స్టేషనరీ కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. గత పాలకులు తమకు కావాల్సిన సంస్థలకు వాటి సరఫరా బాధ్యతను నోటి మాట ద్వారా అప్పగించారు. అది కూడా మార్కెట్ ధర కంటే అదనంగా చెల్లించి మరీ సామగ్రి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఏటా లక్షలాది రూపాయలు దుర్వినియోగం అవు తున్నాయి. అయితే, గత పాలకులు అను సరించిన విధానాన్ని సమీక్షించాల్సిన ప్రస్తుత అధికారులు కూడా ఏమీ పట్టనట్టు వ్యవహ రించడంతోపాటు అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.
ఇవీ కొనుగోలు..
వర్సిటీ అధికారులు కొనుగోలు చేసే స్టేషనరీ ఐటమ్స్‌లో యాడ్ సెల్ పెన్స్, రీఫిల్స్, వంద పేజీల లాంగ్ రిజిస్టర్స్, క్లాత్ లైన్డ్ కవర్స్, ఆన్సర్ షీట్స్, ఓఎంఆర్ షీట్స్, వైట్ పేపర్స్‌తోపాటు 45కుపైగా రకాలు ఉంటాయి. వీటిని కేటగిరీల వారీగా విభజించి టెండర్లు ఆహ్వానిస్తుంటారు. తక్కువ మొత్తానికి సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు అవకాశాన్ని కల్పి స్తుంటారు. అయితే, గడిచిన నాలుగేళ్లుగా టెండర్లు లేకుండానే కొన్ని సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేస్తున్నారు. తక్కువకు అందిం చేందుకు మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చినా...కాదని మరీ ఆయా సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. క్లాత్ లైన్డ్ కవర్స్‌ను రూ.14 చొప్పున కొనుగోలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మరొకరు రూ.10.50కు సరఫరా చేస్తామని వచ్చినా అప్పటి అధికారులు కాదన్నట్టు చెబుతున్నారు. ఈ క్లాత్ లైన్డ్ కవర్స్ ఏడాదికి 1.5 లక్షల వరకూ వినియోగిస్తుంటారు. అలాగే, కంప్యూటర్ స్టేషనరీ ఐటమ్స్ ఐదు నుంచి ఆరు లక్షల వరకు వాడుతుంటారు. వీటికి ఏటా రూ.10 నుంచి రూ.15 లక్షల వరకూ బిల్లులు చెల్లిస్తున్నారు. అలాగే, ఓఎంఆర్ షీట్స్, ఆన్సర్ షీట్స్ కూడా లక్షల్లోనే కొనుగోలు చేస్తున్నారు. వీటికి కూడా భారీ ధరను చెల్లిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులతోపాటు మంత్రికి కూడా కొందరు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
లక్షలాది రూపాయలు మిగులు
వర్సిటీకి అవసరమైన స్టేషనరీ సామగ్రిని 2012-13 ఏడాదిలో టెండర్లు లేకుండా కొనుగోలు చేశారు. మరుసటి ఏడాది అంటే 2013-14లో టెండర్లు పిలిచారు. ఆ ఏడాది కంటే అంతకు ముందు ఏడాది రూ.29,63,796 అధికంగా చెల్లించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి టెండర్లు పిలిచి తక్కువ మొత్తానికి సరఫరా చేసే సంస్థలకు అవకాశం ఇస్తున్నారు. అయితే వైసీపీ హయాం నుంచి ఈ విధానానికి స్వస్తి చెప్పి అస్మదీయ సంస్థల నుంచి కొనుగోలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ కొనుగోలు వ్యవహారాలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - Jul 03 , 2025 | 01:10 AM