ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలతో చతికిలబడి

ABN, Publish Date - May 06 , 2025 | 12:39 AM

మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. కనీస వసతులు లేక అధ్వానంగా ఉన్నాయి. కొన్ని పాఠశాలల భవనాలకు అధికారులు పైపైన రంగులు అద్దారే తప్ప లోపల సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సౌకర్యాలు లేకపోయినా పైపైన రంగులు వేసి మెరుగులు దిద్దిన కొత్తవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల

మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ

గత వైసీపీ ప్రభుత్వంలో నాడు- నేడు కింద నామమాత్రంగా పనులు

కనీస వసతులు లేక విద్యార్థుల కష్టాలు

పట్టించుకోని అధికారులు

అనంతగిరి, మే 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. కనీస వసతులు లేక అధ్వానంగా ఉన్నాయి. కొన్ని పాఠశాలల భవనాలకు అధికారులు పైపైన రంగులు అద్దారే తప్ప లోపల సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మండలంలో 12 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అయితే అన్ని పాఠశాలల్లో ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. గత వైసీపీ ప్రభుత్వం నాడు- నేడు పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పడమే తప్ప మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా పాఠశాలల్లో జరిగిన పనుల్లో నాణ్యత లోపించడంతో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. కొన్ని పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడం, కొన్ని చోట్ల తాగునీరు, రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేకపోవడం.. ఇలా చాలా సమస్యలు పాఠశాలలను వేధిస్తున్నాయి. అసౌకర్యాల నడుమ విద్యార్థులు చదువులు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.

కొత్తవలస పాఠశాలలో..

మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొత్తవలస గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. 1988లో వసతి గృహం నిర్మించారు. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరడంతో శ్లాబ్‌ పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. కిటికీలు, తలుపులు లేకపోవడం, సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహంలో ఫ్యాన్లు లేక అవస్థలు పడుతున్నారు.

బాలికల-1 పాఠశాలలో..

మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల-1 పాఠశాలలో 640 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వీరికి 60 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. అదనంగా మరుగుదొడ్లు నిర్మించాలన్నా స్థలాలు లేకపోవడంతో ప్రతిపాదనలు ముందుకు సాగడం లేదు.

బాలికల-2 పాఠశాలలో..

మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల-2 పాఠశాలలో 480 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థినులకు రక్షణ లేకుండాపోయింది. అలాగే తాగునీటితో పాటు రన్నింగ్‌ వాటర్‌ సమస్య ఉంది. కేవలం 18 మరుగుదొడ్లు మాత్రమే ఉండడంతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు.

లుంగుపర్తి బాలుర పాఠశాలలో..

లంగుపర్తి గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో సుమారు 130 మంది చదువుతున్నారు. ఇది పాత భవనం కావడంతో తరగతి గదులన్నీ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నాడు- నేడు పథకం రెండో విడతలో 1.7 కోట్లతో వసతి గృహం శ్లాబ్‌ నిర్మాణ పనులు జరిగాయి. అయితే సకాలంలో బిల్లులు మంజూరుకాకపోవడంతో పనులు నిలిచిపోయాయి.

చిలకలగెడ్డ ఆశ్రమ బాలుర పాఠశాలలో..

ఏజెన్సీ ముఖద్వారమైన చిలకలగెడ్డ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో 350 మంది చదువుతున్నారు. ఇక్కడ కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గృహం నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాలేదు.

భీంపోలు బాలికల పాఠశాలలో..

భీంపోలు పంచాయతీ కేంద్రంలోని ఆశ్రమ బాలికల పాఠశాలలో 370 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఒక్క మంచినీటి బోరు ఉండడం, దాని నుంచి కూడా సక్రమంగా నీరు రాకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు.

కొరవడిన వసతులు

పెద్దబిడ్డలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాల ప్రహరీ నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే నిలిపివేశారు. అలాగే పినకోట ఆశ్రమ బాలుర పాఠశాలలో 170 మంది విద్యార్థులు చదువుతున్నారు. డైనింగ్‌ హాల్‌, ప్రహరీ, తాగునీటి సమస్యలు వేధిస్తున్నాయి. జీనబాడు ఆశ్రమ బాలికల పాఠశాలలో 350 మంది చదువుతున్నారు. ఈ పాఠశాలకు ప్రహరీ నిర్మించకపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 06 , 2025 | 12:39 AM