ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

క్రీడా ప్రాంగణాలు ప్రైవేటుకు ధారాదత్తం

ABN, Publish Date - May 06 , 2025 | 01:14 AM

ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ లీజుకి ఇచ్చేసిన ఎంవీపీకాలనీలో స్పోర్ట్స్‌ ఎరీనా

ఒక్కొక్కటిగా అప్పగిస్తున్న జీవీఎంసీ

ఇప్పటికే స్పోర్ట్స్‌ ఎరీనా,

ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కట్టబెట్టిన అధికారులు

భారీగా ఫీజులు వసూలుచేస్తున్న నిర్వాహకులు

ఆటలకు దూరమైపోతున్న పేద, మధ్యతరగతి వర్గాలు

తాజాగా రూ.15 కోట్లతో ఆధునికీకరించిన

స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియాన్ని

ప్రైవేటుకు అప్పగించే యోచన?

క్రీడా సంఘాల ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

చిన్నారులు, యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఏర్పాటుచేసిన జీవీఎంసీ క్రీడా ప్రాంగణాలు ఒక్కొక్కటి ప్రైవేటుపరమైపోతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన స్టేడియాల నిర్వహణ బాధ్యతను నగర పాలక సంస్థ...ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెడుతోంది. నిర్వాహకులు భారీగా ధరలు నిర్ణయించి పిల్లల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నారు.

స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంతోపాటు బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో వివిధ క్రీడాంశాల్లో వందలాది మంది క్రీడాకారులు నిత్యం సాధన చేసేవారు. ఉన్నత సదుపాయాలు, ఉత్తమ కోచ్‌లు అందుబాటులో ఉండడంతో నైపుణ్యం సాధించేవారు. రాష్ట్ర, జాతీయస్థాయి టోర్నమెంట్లలో సత్తాచూపి నగరానికి ఖ్యాతి తెచ్చేవారు. వారిని మరింత ప్రోత్సహించేలా జీవీఎంసీ చర్యలు ఉండాలి. కానీ కొంతమంది అధికారులు స్వలాభం కోసం స్టేడియాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తున్నారు. నిర్వాహకులు వ్యాపార దృక్పథంతో భారీ ఫీజులు వసూలుచేస్తున్నారు. దీంతో డబ్బున్నవారే ఆయా స్టేడియాల్లో అడుగుపెట్టగలుగుతున్నారు. ప్రతిభ ఉన్నా సాధనకు అవకాశం లేక సాధారణ కుటుంబాల వారు ఆశలు చిదిమేసుకుంటున్నారు.

ఎంవీపీ కాలనీలోని ఏఎస్‌ రాజా కాలేజీ మైదానంలో టీడీపీ ప్రభుత్వ హయాం (2015)లో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద రూ.4.5 కోట్లతో ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనా కాంప్లెక్స్‌ నిర్మాణం ప్రారంభించారు. బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ కోర్ట్‌లు, స్విమ్మింగ్‌పూల్‌ నిర్మించారు. నిర్మాణం చివరి దశలో ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో పనులు ఆలస్యమయ్యాయి. పూర్తయిన తర్వాత జీవీఎంసీ స్టేడియం నిర్వహణ చూస్తుందని ప్రకటించారు. కానీ జీవీఎంసీలో ఓ ఉన్నతాధికారి తన అస్మదీయుడికి లబ్ధి చేకూర్చేందుకు లీజు పేరుతో అప్పగించారు. భారీగా ఫీజులు నిర్ణయించడంతో సాధారణ, మధ్య తరగతి క్రీడాకారులు సాధనకు దూరమయ్యారు.

బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో రెండు స్విమ్మింగ్‌పూల్స్‌ ఉన్నాయి. వాటిని జీవీఎంసీ నిర్వహించేది. పెద్దలకు నెలకు రూ.200, చిన్నారులకు రూ.100 చొప్పున ఫీజు వసూలుచేసేవారు. ఇక్కడ సాధన చేసినవారిలో ఎంతోమంది రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటారు. కరోనా సమయంలో దీనిని మూసివేయడంతో మరమ్మతులకు గురైంది. తర్వాత రూ.2.5 కోట్లు వెచ్చించి ఆధునికీకరించారు. ఇది అందుబాటులోకి వస్తే స్విమ్మింగ్‌ సాఽధనకు అవకాశం ఉంటుందని అంతా ఆశపడ్డారు. చివరకు స్పోర్ట్‌ ఎరీనాను దక్కించుకున్న వ్యక్తికే బినామీ పేరుతో అప్పగించారు. ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో జీవీఎంసీ నిర్ణయించిన ఫీజు, తర్వాత నిర్వాహకులకు నచ్చిన మొత్తం వసూలుచేసుకునేలా వెసులుబాటు కల్పించారు. దీనిని అలుసుగా తీసుకుని మూడు నెలలు ఫీజు చెల్లించాలని షరతు పెట్టడంతో చాలామంది సాధనకు దూరమయ్యారు.

స్వర్ణభారతిదీ అదే దారి...

మద్దిలపాలెం సమీపంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం పరిస్థితి ఇలాగే ఉంది. ఇక్కడ వందలాది మంది బ్యాడ్మింటన్‌, కిక్‌బాక్సింగ్‌ సాఽధన చేస్తుంటారు. వీరంతా ఏడాదికి రూ.వెయ్యి చొప్పున జీవీఎంసీకి ఫీజుగా చెల్లించేవారు. నిపుణులైన కోచ్‌లు మెలకువలు నేర్పుతుంటారు. ఈ స్టేడియానికి జీవీఎంసీ రూ.15 కోట్లతో సీటింగ్‌, ఫ్లోరింగ్‌, ఏసీ ప్లాంటు, లైటింగ్‌ సిస్టమ్‌ వంటి హంగులు కల్పిస్తోంది. పనులు చివరిదశకు చేరడంతో ఈ నెలలో ప్రారంభించేందుకు జీవీఎంసీ కసరత్తు చేస్తోంది. దీనిపైనా ప్రైవేటు వ్యక్తుల కన్ను పడినట్టు ప్రచారం జరుగుతోంది. అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని క్రీడా సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. మేయర్‌ పీలా శ్రీనివాసరావు దృష్టి సారించి జీవీఎంసీ ఆధ్వర్యంలోనే నిర్వహణ సాగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - May 06 , 2025 | 01:14 AM