తుప్పలతో తిప్పలు
ABN, Publish Date - May 14 , 2025 | 11:31 PM
జిల్లా కేంద్రం పాడేరు నుంచి ఒడిశా సరిహద్దులో ఉన్న జోలాపుట్టు వెళ్లే 61 కిలోమీటర్ల మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలతో వాహనచోదకులు నిత్యం తిప్పలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా ఏపుగా, దట్టంగా తుప్పలు పెరగడంతో వాహనాలకు దారి ఇవ్వడం, మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
పాడేరు- జోలాపుట్టు మార్గంలో ప్రమాదకరంగా తుప్పలు
మలుపులు కనిపించక ప్రమాదాలకు గురవుతున్న వాహనాలు
జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టకపోవడంతో ఈ దుస్థితి
ఆంధ్రా, ఒడిశా రాకపోకలకు ఈ మార్గమే ఆధారం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రం పాడేరు నుంచి ఒడిశా సరిహద్దులో ఉన్న జోలాపుట్టు వెళ్లే 61 కిలోమీటర్ల మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న తుప్పలతో వాహనచోదకులు నిత్యం తిప్పలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుకు ఇరువైపులా ఏపుగా, దట్టంగా తుప్పలు పెరగడంతో వాహనాలకు దారి ఇవ్వడం, మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తించలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ మార్గంలో ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదాలు ఖాయం. ఈ సమస్య కారణంగానే ఇటీవల కాలంలో ఎక్కువగా ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొనడం, మలుపుపై స్పష్టత లేక బోల్తా కొట్టడం వంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆంధ్రా, ఒడిశా రాకపోకలకు ఈ మార్గమే ప్రధానం
ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా రాష్ట్రానికి రాకపోకలు సాగించాలంటే పాడేరు- జోలాపుట్టు మార్గమే ప్రధానం. ఈ క్రమంలో ఆంధ్రాకు చెందిన వాహనాలతోపాటు ఒడిశాకు చెందిన వాహనాలతో ఈ మార్గం నిత్యం రద్దీగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఈ మార్గంలో ఎక్కడికక్కడ రోడ్డుకు ఇరువైపులా తుప్పలు అధికంగా ఉండడంతో ప్రమాదాలకు ఆస్కారం కలుగుతున్నది. ముఖ్యంగా పాడేరు నుంచి మొదలైతే...మండలంలో గుత్తులపుట్టు, హుకుంపేట మండలం ఎం.బొడ్డాపుట్టు, పెదబయలు మండలంలో గంపరాయి, ఈదులపుట్టు, మంగబంధ, అరడకోట, ముంచంగిపుట్టు మండలం కిలగాడ, పనసపుట్టు, గుమ్మాఘాట్, బోండ్రుగుడ ప్రాంతాల్లోని మలుపులకు ఇరువైపులా తుప్పలు అధికంగా పెరిగిపోయాయి. గతంతో పోలిస్తే మూడేళ్లుగా ఈ మార్గంలో రాకపోకలు పెరిగాయి.
ఈ మార్గంలో జంగిల్ క్లియరెన్స్ ఊసేలేదు
రోడ్లు, భవనాల శాఖకు చెందిన మెయిన్‌రోడ్డులో ప్రతి ఏడాదిలో కనీసం రెండు మార్లు జంగిల్ క్లియరెన్స్ చేయాల్సి ఉంది. కానీ కొన్నాళ్లుగా ఎటువంటి జంగిల్ క్లియరెన్స్ చేపట్టకపోవడంతో రోడ్డంతా తుప్పలు మొలిచాయి. దీంతో రోడ్డు పక్కకు వాహనాన్ని దింపలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి రోడ్డుకు ఇరువైపులా మూడేసి అడుగుల చొప్పున అంచులు ఉంటాయి. కానీ ఆ అంచులు సైతం తుప్పలతో కప్పేశాయి. ముఖ్యంగా మలుపుల వద్ద ఎక్కువగా తుప్పలు మొలిచిపోవడంతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనం కనిపించ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మలుపుల వద్ద ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పాడేరు- జోలాపుట్టు మార్గంలో ప్రమాదకరంగా ఉన్న తుప్పలను తొలగించాలని డ్రైవర్లు, ప్రయాణికులు కోరుతున్నారు.
Updated Date - May 14 , 2025 | 11:31 PM