సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ
ABN, Publish Date - Apr 11 , 2025 | 11:04 PM
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఏఎన్.దినేశ్‌కుమార్ ఆదేశం
2,347 వినతుల ఆడిట్‌కు చర్యలు తీసుకోండి
మీకోసంలో 110 వినతుల స్వీకరణ
పాడేరు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 2,347 వినతులను ఆడిట్ చేయాల్సి ఉందని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే అన్ని రంగాల్లో జిల్లా పురోగతి సాధించాలని, ప్రధానంగా వ్యవసాయానుబంధ రంగాల్లో 15 వృద్ధి రేటును సాధించాలన్నారు.
మీకోసంలో 110 వినతుల స్వీకరణ
ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ్, డీఆర్‌వో కె.పద్మలత అర్జీదారుల నుంచి 110 వినతులను స్వీకరించారు. అరకులోయలో పీవీటీజీ బాలుర ఆశ్రమ పాఠశాలకు ప్రహారీ మంజూరు చేయాలని జి.మల్లేశ్వరరావు కోరగా, చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ కట్టువీధికి తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు గడుతూరు జీవరత్నం, వెలగ దావీదు కోరారు. అలాగే పాడేరు మండలం బంట్రోతుపుట్టు గ్రామంలో అంగన్‌వాడీ కేంద్ర భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని గెమ్మిలి నాగేశ్వరరావు కోరగా, జి.మాడుగుల మెయిన్‌రోడ్డు నుంచి చుట్టుమెట్ట గ్రామానికి రోడ్డు నిర్మించాలని వంతాల తిమోతి కోరారు. అలాగే హుకుంపేట మండలంలో కామయ్యపేట రోడ్డుకు మరమ్మతులు చేయాలని తడిగిరి, తీగలవలస, గ్రామాలకు చెందిన పి.గంగరాజు, పి.రామచంద్, తదితరులు కోరగా, ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ బొడ్డగొంది గ్రామానికి పాఠశాల భవనం మంజూరు చేయాలని సర్పంచ్ ఎన్.భాగ్యవతి కోరారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్, జిల్లా ఉద్యానవనాధికారిరమేశ్‌కుమార్‌రావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈలు కె.వేణుగోపాల్, జి.డేవిడ్‌రాజు, డ్వామా పీడీ విద్యాసాగర్, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, టీడబ్ల్యూ డీడీ ఎల్.రజని, డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్.కుమార్, పశుసంవర్థక శాఖ డీడీ నరసింహులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 11 , 2025 | 11:04 PM