కాలుష్య సమస్యకు పరిష్కారం
ABN, Publish Date - May 06 , 2025 | 01:12 AM
జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని తిరుమలనగర్, సిద్ధార్థ నగర్, పాత వడ్లపూడి, కాళింగుల వీథి, తారకరామా నగర్ వాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న కాలుష్య సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనున్నది. ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండా...’’ కార్యక్రమంతో అందుకు ముందడుగుపడింది. వివరాలిలా ఉన్నాయి.
గాజువాక ఆటోనగర్ ఈ బ్లాక్ వద్ద వ్యర్థాలు డంప్ చేయకుండా గోడ నిర్మాణం
అక్కడ ఉన్న చెత్తను కాపులుప్పాడ తరలిస్తామన్న ఐలా కమిషనర్
సీసీ కెమెరాలు కూడా ఏర్పాటుచేస్తామని వెల్లడి
కూర్మన్నపాలెం, మే 5 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ 87వ వార్డు పరిధిలోని తిరుమలనగర్, సిద్ధార్థ నగర్, పాత వడ్లపూడి, కాళింగుల వీథి, తారకరామా నగర్ వాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న కాలుష్య సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనున్నది. ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండా...’’ కార్యక్రమంతో అందుకు ముందడుగుపడింది. వివరాలిలా ఉన్నాయి.
ఆటోనగర్ ఈ బ్లాకులో గల కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను పక్కనున్న ఖాళీ స్థలంలో వేయడంతో అది డంపింగ్ యార్డుగా మారింది. దాంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా రాత్రిపూట వాహనాల్లో వ్యర్థాలను తీసుకువచ్చి అక్కడ పడేస్తుండేవారు. గుర్తుతెలియని వ్యక్తులు తరచూ యార్డులో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో పరిసర గ్రామాల వాసులు ఇబ్బందిపడుతుండేవారు. పొగ కారణంగా వృద్ధులు, చిన్నారులు అస్వస్థతకు గురై, శ్వాసకోశ వ్యాధుల బారినపడేవారు. అక్కడ చెత్తను తొలగించాల్సిందిగా జీవీఎంసీ, ఐలా అధికారులకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో జనవరి 28వ తేదీన వడ్లపూడిలో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండా...’’ కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకువచ్చారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించాలని కోరారు. స్పందించిన వార్డు కార్పొరేటర్ బొండా జగన్ కాలనీ వాసులతో కలిసి డంపింగ్ యార్డు వద్ద ఆందోళన చేసి, సమస్యను ఏఎంహెచ్‌ఓ కిరణ్‌కుమార్, ‘ఐలా’ కమిషనర్ అయినవిల్లి కిషోర్ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ కిషోర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి చొరవచూపారు. అక్కడ చెత్తను తొలగించి, ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టేందుకు రూ.7 లక్షలు మంజూరుచేశారు. ఈ మేరకు ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ సెక్యూరిటీని పెట్టామని, ప్రహరీని పూర్తిగా నిర్మించిన తరువాత చెత్తా, చెదారాలను కాపులుప్పాడ తరలిస్తామని, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామని ఐలా కమిషనర్ అయినవిల్లి కిషోర్ పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ఉన్న సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ‘ఆంధ్రజ్యోతి’కి తిరుమలనగర్, సిద్ధార్థ నగర్, కాలనీల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ ఇప్పటికే ఉన్న చెత్తా, చెదారాన్ని పూర్తిగా తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - May 06 , 2025 | 01:12 AM