స్మార్ట్ మీటర్లపై రగడ
ABN, Publish Date - Jul 19 , 2025 | 12:36 AM
విద్యుత్ స్మార్ట్ మీటర్లపై ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రోజూ ఎక్కడో ఒకచోట నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.
వైసీపీ హయాంలో వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు
ఆ తరువాత పంచాయతీలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలకు...
నెలకు 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే గృహాలకు కూడా అమర్చాలని వారం క్రితం నిర్ణయం
ఒప్పుకోబోమని సంఘాల హెచ్చరిక
మీటరుకు రూ.7 వేలు వసూలు చేస్తారనే అపోహలు
రూపాయి కూడా తీసుకోబోమంటున్న అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విద్యుత్ స్మార్ట్ మీటర్లపై ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో రోజూ ఎక్కడో ఒకచోట నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. వాటిని వినియోగదారులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో అయితే అపార్ట్‌మెంట్ల అసోసియేషన్లు సమావేశాలు పెట్టుకొని తాము స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఒప్పుకోబోమని ప్రకటిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్మార్ట్ మీటర్ల కార్యక్రమం మొదలైంది. మొదట వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకే పరిమితం అంటూ ప్రకటించారు. వ్యవసాయ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తున్నందున ఆ వినియోగం ఎక్కడ ఎంత మేరకు ఉందో కచ్చితంగా తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయంటూ పొలాల్లో మోటార్లకు అమర్చారు. ఆ తరువాత ప్రభుత్వ కార్యాలయాల నుంచి బిల్లులు సరిగ్గా వసూలు కావడం లేదని, అలాగే పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బిల్లులు పేరుకుపోతున్నాయని, వాటి లెక్కలు తేల్చడానికి ఈ స్మార్ట్ మీటర్లు పెడతామంటూ...ఇటీవల వాటికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులకు పెడతామన్నారు. ఇప్పుడు అంటే మూడు నెలల నుంచి...ఇళ్లలో నెలకు 200 యూనిట్లకు పైబడి విద్యుత్ ఉపయోగించే వారికి కూడా స్మార్ట్ మీటర్లు పెడతామని, ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈపీడీసీఎల్ అధికారులు ప్రకటించారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో తొలుత వ్యవసాయ కనెక్షన్లకు గత వైసీపీ ప్రభుత్వంలోనే స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, పరిశ్రమలు, వాణిజ్య మీటర్లకు పెడుతున్నారు. గృహాలకు స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రక్రియ పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. వారం క్రితమే ఆ పనులు కూడా చేపట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.
వ్యతిరేకత ఎందుకంటే?
స్మార్ట్ మీటరు పెడితే మొబైల్ ఫోన్‌ను నెల నెలా ఎలాగైతే ముందుగా రీచార్జి చేసుకుంటామో...ఈ మీటర్‌ను కూడా అలాగే ముందుగా బిల్లు చెల్లించి రీచార్జి చేసుకోవాలి. ప్రస్తుతం విద్యుత్ వాడిన తరువాత బిల్లు ఇస్తున్నారు. దానిని చెల్లించడానికి రెండు వారాల గడువు ఉంటోంది. ఈ మీటరు పెడితే బిల్లు ముందుగానే కట్టాలి. అందుకే చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
- ఈ మీటర్లను పెట్టుకుంటే బిల్లు ఎక్కువ వస్తుందని చాలామంది ఆరోపిస్తున్నారు. వినియోగదారుడి ఇంట్లో మీటరును అధికారులు ఆఫీసులో కూర్చుని మేనేజ్ చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
- ఒక్కో విద్యుత్ స్మార్ట్ మీటర్‌ను ప్రభుత్వం సుమారుగా రూ.7 వేలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచే నెలనెలా బిల్లులో వసూలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అవసరం లేని మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేయడాన్ని కూడా వినియోగదారులు వ్యతిరేకిస్తున్నారు.
200 యూనిట్లు దాటితే...
200 యూనిట్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఈ మీటర్లు పెడతారు. ప్రభుత్వం నుంచి రాయితీ పొందే వారికి, 200 యూనిట్ల కంటే తక్కువ వాడేవారికి వీటిని కావాలన్నా పెట్టరు.
అవన్నీ అపోహలు
శ్యాంబాబు, ఎస్‌ఈ, విశాఖపట్నం సర్కిల్.
స్మార్ట్ మీటర్లు పెడితే ఎక్కువ బిల్లు వస్తుందనేది అపోహ. అవాస్తవ ప్రచారం మాత్రమే. అలాంటి తప్పులు ఏమైనా జరిగితే సమీక్షించడానికి, చర్యలు చేపట్టడానికి వ్యవస్థలు ఉన్నాయి. అదే విధంగా మీటరుకు డబ్బులు వసూలు చేస్తారనేది కూడా దుష్ప్రచారమే. అది పూర్తిగా ఉచితం. గృహాలకు స్మార్ట్ మీటర్ల ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది. పూర్తి కావడానికి సమయం పడుతుంది. మీటరు సరఫరా చేసిన సంస్థ పదేళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యతలు చూస్తుంది.
జిల్లాలో ఎన్ని ఏర్పాటు చేశారంటే...
- విశాఖ జిల్లాలో మొత్తం విద్యుత్ సర్వీసులు 10,33,943.
- ప్రభుత్వ సంస్థల్లో సర్వీసులు 13,458 ఉండగా 12,600 అమర్చారు.
- పంచాయతీలు, పరిశ్రమలు, వాణిజ్య సర్వీసులు అన్నీ కలిపి 2,11,000 ఉండగా వాటిలో ఇప్పటివరకూ 57,329 స్మార్ట్ మీటర్లు పెట్టారు. ఇంకా 1,53,686 పెట్టాల్సి ఉంది.
- గృహ వినియోగదారులకు అక్కడక్కడా ఏర్పాటుచేస్తున్నారు. పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.
Updated Date - Jul 19 , 2025 | 12:36 AM