వచ్చే నెల 9,10 తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ
ABN, Publish Date - Jun 06 , 2025 | 01:03 AM
వచ్చే నెల తొమ్మిది, పది తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుందని, అందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా పటిష్ఠ ఏర్పాట్లు
భక్తులు జాతీయ రహదారి దాటే చోట తాత్కాలికంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
కొండ దిగువన తొలి పావంచా వద్ద పోలీస్ బందోబస్తు
సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్
9 మధ్యాహ్నం రెండు గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభం: ప్రధాన అర్చకులు
విశాఖపట్నం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల తొమ్మిది, పది తేదీల్లో సింహగిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉంటుందని, అందుకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలన్నారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల గిరి ప్రదక్షిణకు, స్వామి వారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులు జాతీయ రహదారి దాటే చోట తాత్కాలిక ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్, సీపీ శంఖబ్రతబాగ్చీ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను సమన్వయం చేసుకుంటూ తదుపరి చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. క్యూలైన్లను పక్కాగా ఏర్పాటుచేయాలని, గాలి,వానలకు ఇబ్బంది లేకుండా చూడాలని పేర్కొన్నారు. తొమ్మిదో తేదీ తెల్లవారుజాము నుంచి పదో తేదీ సాయంత్రం వరకూ దర్శనాలు ఉంటాయన్నారు. కొండ దిగువన తొలి పావంచా వద్ద భక్తులను, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీస్ బందోబస్తు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటుచేయాలని సూచించారు. క్యూలైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, తోపులాటలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేయాలన్నారు. ఆలయ ఈవో సూచనల మేరకు అవసరమైన అంబులెన్స్‌లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగాలని, అవసరమైన మేరకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని, పార్కింగ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. స్టాళ్లు పెట్టుకునే వారికి ముందుగా అనుమతి ఇచ్చి సంబంధిత మార్గదర్శకాలను జారీ చేయాలన్నారు. భక్తులకు అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. కొండపై అగ్నిమాపక శకటం, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రధాన అర్చకులు వైదిక కార్యక్రమాల షెడ్యూల్‌ను వివరించారు. తొమ్మిదో తేదీ ఉదయం నుంచి దర్శనాలు మొదలవుతాయని, ఆరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రచార రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టడం ద్వారా గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. పదో తేదీ సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగుతాయని, ఆ రోజే స్వామి వారికి నాలుగో విడత చందన సమర్పణ జరుగుతుందని వివరించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు
ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సహకారంతో కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. తొలి పావంచా వద్ద అవసరానికి తగినట్టుగా కొబ్బరికాయలు కొట్టేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. కొండపైన 170, దిగువన 58 సీసీ కెమెరాలు ఉన్నాయని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరిన్ని ఏర్పాటుచేస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, ఏడీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఆర్డీవో సంగీత్ మాథుర్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 06 , 2025 | 01:03 AM