ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రోడ్లపై మళ్లీ దుకాణాలు

ABN, Publish Date - Apr 23 , 2025 | 01:27 AM

వన్‌టౌన్‌లోని పూర్ణామార్కెట్‌ మెయిన్‌రోడ్డులో మళ్లీ ఆక్రమణలు వెలిశాయి.

  • పూర్ణామార్కెట్‌ ప్రాంతంలో తిరిగి ఆక్రమణలు

  • ఆశీలు కాంట్రాక్టర్‌ ప్రోద్బలం

  • చోద్యం చూసిన పోలీస్‌, జీవీఎంసీ అధికారులు

  • కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గడమే కారణమని ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వన్‌టౌన్‌లోని పూర్ణామార్కెట్‌ మెయిన్‌రోడ్డులో మళ్లీ ఆక్రమణలు వెలిశాయి. రోడ్డుపై దుకాణాల ఏర్పాటు వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతుందని ఫిర్యాదులు అందడంతో ఇటీవల నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి ఆక్రమణలను తొలగింపజేశారు. ఏం జరిగిందో తెలియదుగానీ మంగళవారం మళ్లీ రోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది. కళ్లముందే రోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేసుకున్నా పోలీస్‌, జీవీఎంసీ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పూర్ణామార్కెట్‌లో సుమారు 640 దుకాణాలు ఉన్నాయి. ఇంకా బయట హోల్‌సేల్‌ షాపులు ఉంటాయి. వస్తువుల కొనుగోలు కోసం నగరం నలుమూలల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో వస్తుంటారు. వారి వాహనాల పార్కింగ్‌ కోసం మార్కెట్‌ మెయిన్‌రోడ్డులో ఒకవైపు కేటాయించారు. మార్కెట్‌ రోడ్డు మీదుగా రాకపోకలు సాగించే వాహనాల కోసం మిగిలిన రోడ్డును కేటాయించారు. ఇదిలావుండగా మార్కెట్‌లోని దుకాణాల నుంచి రోజువారీ ఆశీలుతోపాటు వాహనాల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు కోసం జీవీఎంసీ జోన్‌-4 రెవెన్యూ ఆధ్వర్యంలో బహిరంగ వేలం వేసి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ ఆశీలు వసూలుకోసం కొన్నాళ్ల కిందట వేలం నిర్వహించగా ఒకరు సుమారు రూ.92 లక్షలకు పాడుకున్నారు. ఆ కాంట్రాక్టర్‌కు ఆశీలు వసూలు చేసేందుకు స్టాండింగ్‌ కమిటీ ఇంకా ఆమోదం ఇవ్వాల్సి ఉంది. స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరగకపోవడంతో ఆ అంశం ఇంకా ఆమోదం పొందకపోవడంతో జోన్‌-4 రెవెన్యూ అధికారులే రోజువారీ ఆశీలు వసూలుచేయాలి. కానీ వేలం దక్కించుకున్న వ్యక్తి అధికార పార్టీ నేతల అనుచరుడినంటూ జీవీఎంసీ అధికారుల వద్ద హడావిడి చేసి నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌లో రోజువారీ ఆశీలు వసూలుచేయడం ప్రారంభించారు. ప్రతిరోజూ సుమారు రూ.45 వేలు ఆశీలు వసూలవుతుండగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు జీవీఎంసీ డిపార్టుమెంటల్‌ కలెక్షన్‌ పేరుతో సౌకర్యం కేంద్రంలో రూ.వెయ్యి మాత్రమే డిపాజిట్‌ చేస్తున్నారు. మిగిలిన డబ్బును జీవీఎంసీ, పోలీస్‌ అధికారులతోపాటు కాంట్రాక్టర్‌ వాటాలుగా పంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రోడ్డుపై దుకాణాలు పెట్టించినట్టయితే భారీగా ఆశీలు వసూలవుతుందని జీవీఎంసీ, పోలీస్‌ అధికారుల వద్ద కాంట్రాక్టర్‌ అభిప్రాయం వ్యక్తంచేయగా...దక్షిణ నియోజకవర్గానికి చెందిన నేతలతో తమకు ఒక ఫోన్‌ చేయిస్తే అందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి నేతలతో అధికారులకు ఫోన్‌ చేయించి రోడ్డుపై దుకాణాల ఏర్పాటుకు గల అడ్డంకులను తొలగించుకున్నారు. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటికి స్పందించిన సీపీ శంఖబ్రతబాగ్చి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ కిందిస్థాయి పోలీస్‌ అధికారులు స్పందించకపోవడంతో ఆయనే స్వయంగా పూర్ణామార్కెట్‌ను సందర్శించారు. రోడ్డుపై దుకాణాలు ఏర్పాటుచేయడం చూసి ఆగ్రహం వ్యక్తంచేశారు. మెయిన్‌రోడ్డుతోపాటు చుట్టుపక్కల రోడ్లపై ఆక్రమణలను తొలగించాల్సిందిగా ఆదేశించారు. దీంతో ట్రాఫిక్‌, పార్కింగ్‌ ఇబ్బందులు తొలగడంతోపాటు కొనుగోలుదారులు, వ్యాపారులంతా ఆనందం వ్యక్తంచేశారు. ఇది

ఇదిలావుండగా మంగళవారం సాయంత్రం తిరిగి మార్కెట్‌ మెయిన్‌రోడ్డులో దుకాణాలను తిరిగి ఏర్పాటుచేయడం మొదలెట్టారు. స్వయంగా పోలీస్‌ కమిషనర్‌ దగ్గరుండి ఆక్రమణలను తొలగింపజేస్తే తిరిగి ఏర్పాటవ్వడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డుపై దుకాణాలు ఉండాల్సిందేనని, లేనిపక్షంలో తాను మామూళ్లు ఇవ్వలేనని పోలీస్‌, జీవీఎంసీ అధికారులకు కాంట్రాక్టర్‌ చెప్పినట్టు వ్యాపార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే రోడ్డును ఆక్రమించి దుకాణాలు పెట్టుకున్నా వారు పట్టించుకోకుండా వదిలేసి, పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం సీపీ శంఖబ్రతబాగ్చి వద్ద ప్రస్తావించగా, రోడ్డుపై దుకాణాలను అనుమతించే ప్రసక్తే లేదని, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Apr 23 , 2025 | 01:27 AM