సర్వీస్ రోడ్డు ఆక్రమణ
ABN, Publish Date - Jun 05 , 2025 | 01:22 AM
నగరంలో రోడ్లపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వెంకోజీపాలెం కూడలి నుంచి ఇసుకతోట కూడలి వరకూ సర్వీస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణలతో మూసుకుపోయింది. ఆ రోడ్డులో ప్రయాణించాల్సిన వాహనాలు జాతీయ రహదారి మీదుగా వెళుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
రహదారిపై కర్రలు, ఇంటి సామగ్రి...ఇంకా అనధికార పార్కింగ్
వాహనాలు వెళ్లడానికి అవకాశం లేని పరిస్థితి
ఇదీ వెంకోజీపాలెం వద్ద దుస్థితి
జాతీయ రహదారిపై పెరుగుతున్న వాహనాల రద్దీ
మలుపు కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు
పట్టించుకోని పోలీసులు, జీవీఎంసీ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో రోడ్లపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. వెంకోజీపాలెం కూడలి నుంచి ఇసుకతోట కూడలి వరకూ సర్వీస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణలతో మూసుకుపోయింది. ఆ రోడ్డులో ప్రయాణించాల్సిన వాహనాలు జాతీయ రహదారి మీదుగా వెళుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
హనుమంతవాక వైపు నుంచి భారీసంఖ్యలో వాహనాలు జాతీయ రహదారిపై నగరంలోకి వస్తుంటాయి. సిగ్నల్ పాయింట్ల వద్ద పదుల సంఖ్యలో వాహనాలు బారులుతీరుతుంటాయి. జీవీఎంసీ, పోలీస్ అధికారులు సంయుక్తంగా సమస్యను అధిగమించే అవకాశాలను చాలాకాలం కిందట పరిశీలించారు. ఈ క్రమంలోనే వెంకోజీపాలెం జంక్షన్ నుంచి ఇసుకతోట జంక్షన్ వరకూ సర్వీసురోడ్డు నిర్మించాలని జీవీఎంసీ అధికారులను పోలీసులు కోరారు. జీవీఎంసీ అధికారులు సమారు ఐదారేళ్ల కిందట జాతీయ రహదారిపై ఆక్రమణలను తొలగించి వెంకోజీపాలెం నుంచి ఇసుకతోట జంక్షన్ వరకూ సర్వీస్ రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డును ద్విచక్ర వాహనాలు, ఆటోలకు కేటాయించడం వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉండదని భావించారు. అయితే ఆ రోడ్డును ఆనుకుని ఉన్న దుకాణాలు ఒక్కొక్కటిగా ఆక్రమించడం మొదలెట్టాయి. జీవీఎంసీ, పోలీస్ అధికారులు పట్టించుకోనట్టు వదిలేయడంతో సర్వీస్ రోడ్డు పూర్తిగా ఆక్రమణలకు గురైంది. సర్వీస్ రోడ్డు పొడవునా పాత ఇంటి సామగ్రి, బీరువాల తయారీ, గ్రిల్స్ తయారీ సామగ్రి పెట్టేశారు. మరోవైపు వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల సర్వీస్ రోడ్డులో కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లే అవకాశం ఉండడం లేదు. దీంతో వాహనాలన్నీ జాతీయరహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. పాత వెంకోజీపాలెం వద్ద మలుపులో వాహనాలు అదుపుతప్పడం, అదేసమయంలో వెనుక నుంచి వచ్చే వాహనాలు ముందువెళ్లే వాహనాలను ఢీకొట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం రోజుల్లోనే రెండు ప్రమాదాలు జరిగి ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఇప్పటికైనా జీవీఎంసీ, పోలీస్ అధికారులు స్పందించి సర్వీస్ రోడ్డుపై ఆక్రమణలను పూర్తిగా తొలగించడంతోపాటు పక్కనే ఉన్న దుకాణాలు రోడ్డుపైకి రాకుండా గ్రిల్స్‌ను ఏర్పాటుచేయాలని వాహనచోదకులు కోరుతున్నారు. అలా చేస్తే జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తగ్గుతుందని పేర్కొంటున్నారు.
Updated Date - Jun 05 , 2025 | 01:22 AM