ఉక్కులో వీఆర్‌ఎస్‌కు సీనియర్ల మొగ్గు
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:17 AM
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పథకం ప్రకటించడంతో సీనియర్ అధికారులు అంతా వెళ్లిపోవాలని భావిస్తున్నారు.
పని ఒత్తిడి తట్టుకోలేకే వెళ్లిపోవాలని నిర్ణయం
మలివిడత 600 మందిని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న యాజమాన్యం
అంతకుమించి దరఖాస్తులు అందే అవకాశం
విశాఖపట్నం, జూన్ 16 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మరోసారి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) పథకం ప్రకటించడంతో సీనియర్ అధికారులు అంతా వెళ్లిపోవాలని భావిస్తున్నారు. యాజమాన్యం ఈ ఏడాది డిసెంబరు చివరికల్లా ఉద్యోగుల సంఖ్యను బాగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధికారులు, నాన్ ఎగ్జిక్యూటివ్‌లు కలిపి 9,500 మంది ఉండాలని, అలాగే కాంట్రాక్టు వర్కర్లు 8,500కు మించకూడదని లెక్కలు వేసుకుంది.
ఈ ఏడాది ప్రారంభంలో వీఆర్‌ఎస్ ప్రకటించగా సుమారుగా 1,200 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. కాంట్రాక్టు వర్కర్లను దశల వారీగా తగ్గిస్తున్నారు. ఒకేసారి 2,500 మందిని తొలగించడంతో కార్మిక సంఘాలు సమ్మె చేశాయి. దాంతో యాజమాన్యం పంథా మార్చింది. ఒకేసారి వందల సంఖ్యలో తీయకుండా ఏదైనా కాంట్రాక్టు ముగిసిపోతే, అందులో వర్కర్లకు గేట్ పాస్‌లు ఇవ్వకుండా ఆపేస్తోంది. అలా వారానికి వంద మంది వరకూ తగ్గిపోతున్నారు. ఎవరైనా కార్మిక సంఘం పేరుతో ప్రకటనలు చేస్తే వారికి నోటీసులు ఇస్తున్నారు. దాంతో ఎవరూ నోరెత్తడం లేదు. ఈ నెల 26న మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించనున్నారు. ఆ పేరుతో ఉద్యోగులతో 12 గంటలు పనిచేయిస్తున్నారు. చెప్పిన విధంగా కాంట్రాక్టు వర్కర్లను తగ్గించకపోతే విభాగాధిపతులకు నోటీసులు ఇస్తున్నారు. తక్కువ మందితో పనిచేయడం కష్టంగా ఉండడం, మరోవైపు యాజమాన్యం 100 శాతం ఉత్పత్తి అంటూ పనిభారం మోపడంతో సీనియర్లు వీఆర్‌ఎస్ తీసుకొని వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ప్లాంటులో ఉండి మాటలు పడి, నోటీసులు అందుకునే కంటే వచ్చిన డబ్బులు తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవడమే మేలని భావిస్తున్నారు. యాజమాన్యం ఈసారి 600 మందిని వీఆర్‌ఎస్ ద్వారా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. అంతకు మించి దరఖాస్తులు అందుతాయని అంచనా వేస్తున్నారు.
Updated Date - Jun 17 , 2025 | 01:17 AM