విత్తనాల భద్రతతో భావితరాలకు మేలు
ABN, Publish Date - Apr 26 , 2025 | 11:50 PM
విత్తనాలను భద్రతతో భావితరాలకు ఉపయోగముండేలా కృషి చేద్దామని ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత రాయిమతి గురియ పిలుపునిచ్చారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత రాయిమతి గురియ
డుంబ్రిగుడ, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): విత్తనాలను భద్రతతో భావితరాలకు ఉపయోగముండేలా కృషి చేద్దామని ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహిత రాయిమతి గురియ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కిల్లోగుడలో సంజీవిని సంస్థ ఏర్పాటు చేసిన పాత విత్తనాల పండుగ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విత్తనాల భద్రత ఎంతో ముఖ్యమన్నారు. పాత విత్తనాలతో సాగు చేయడం వల్లే తనకు పద్మశ్రీ అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డుతో దేశవ్యాప్తంగా తనకు గుర్తింపు వచ్చిందని రాయిమతి గురియ అన్నారు. అంతకుముందు పాత విత్తనాలను గిరిజన సంప్రదాయ బద్ధంగా పూజలు చేసి, మట్టి కుండల్లో వేసి, పల్లకిపై ఊరేగించారు. అనంతరం ఆ కుండలను విత్తనాల చెట్టుకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, సంస్థ ప్రతినిధులు కట్టారు. ఈ కార్యక్రమంలో సంజీవిని సంస్థ డైరెక్టర్ దేవుళ్లు, చింతపల్లి పరిశోధన కేంద్రం ఏడీఆర్ అప్పలస్వామి, ప్రగతి, వాసన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 26 , 2025 | 11:50 PM