బదిలీల్లో సచివాలయ సిబ్బంది పైరవీలు
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:20 AM
బదిలీల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పైరవీలు చేస్తున్నారని విమర్శలు న్నాయి. తమకు కావలసిన చోట పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది.
ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో అధికారులపై ఒత్తిడి
రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్లకు అవకాశం ఇవ్వడంతో నచ్చిన చోటకు..
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
బదిలీల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పైరవీలు చేస్తున్నారని విమర్శలు న్నాయి. తమకు కావలసిన చోట పోస్టింగ్ కోసం ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. గత మూడు రోజులుగా విశాఖపట్నంలో జరగుతున్న బదిలీల కౌన్సెలింగ్‌లో ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ, పశుసంవర్థక, ఇంజనీరింగ్ శాఖల్లోని పలువురు ఉద్యోగులు రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్‌కు అవకాశం ఇవ్వడంతో తమకు కావాల్సిన చోట పోస్టింగులు వేయించుకోగలిగారు. మరికొందరు ఐదేళ్లు సర్వీసు పూర్తి పూర్తికాకపోయినా కావాల్సిన చోట పోస్టింగ్ కోసం రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్ కోసం దరఖాస్తు చేసుకొని, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు లేఖలతో బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 522 గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఆయా శాఖల వారీగా ఉమ్మడి విశాఖపట్నం వేదికగా జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన సచివాలయాలను ఎ, బి, సి గ్రేడులుగా విభజించారు. బదిలీల కోసం జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.
ముగిసిన బదిలీల ప్రక్రియ
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జిల్లాలో మొత్తం 3,258 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లు 170 మంది, పశు సంవర్థక శాఖ సహాయకులు 187, ఏఎన్‌ఎంలు 442, ఇంజనీరింగ్ సహాయకులు 315, ఫిషరీస్ సహాయకులు 45, హర్టీకల్చర్ సహాయకులు 89, మహిళా పోలీసులు 312, పంచాయతీ సెక్రటరీలు 155, డిజిటల్ సహాయకులు 384, సర్వే సహాయకులు 377, వీఆర్‌వోలు 75, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సహాయకులు 326, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు 46, వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు 50, వార్డు ఎనర్జీ సెక్రటరీలు 3, వార్డు హెల్త్ సెక్రటరీలు 53, వార్డు ప్లానింగ్ సెక్రటరీలు 38, వార్డు రెవెన్యూ సెక్రటరీలు 39, వార్డు శానిటేషన్ సెక్రటరీలు 52, వార్డు వెల్ఫేర్ సెక్రటరీలు 47, వార్డు ఉమెన్ వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీలు 44 మంది ఉన్నారు. వీరిలో ఐదు సంవత్సరాలు ఒకేచోట విధులు నిర్వహించిన వారు 2,820 మంది ఉన్నారు. వీరందరికీ బదిలీల్లో స్థానచలనం తప్పదని అంటున్నారు. అయితే కావాల్సిన చోట పోస్టింగుల కోసం సిఫారసులకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
Updated Date - Jul 01 , 2025 | 12:20 AM