సముద్ర ఇసుక తోడేళ్లు
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:05 AM
మండలంలో సముద్ర ఇసుకను కూడా అక్రమార్కులు వదలడం లేదు. రేయింబవళ్లు దర్జాగా ట్రాక్టర్లలో తరలించేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా వీరి ఆగడాలు సాగుతున్నాయి.
- రేయింబవళ్లు తీరం వెంబడి తవ్వకాలు
- దర్జాగా ట్రాక్టర్లలో తరలింపు
- పట్టించుకోని అధికారులు
రాంబిల్లి, జూలై 15(ఆంధ్రజ్యోతి): మండలంలో సముద్ర ఇసుకను కూడా అక్రమార్కులు వదలడం లేదు. రేయింబవళ్లు దర్జాగా ట్రాక్టర్లలో తరలించేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా వీరి ఆగడాలు సాగుతున్నాయి.
మండలంలోని లోవపాలెం, వాడనర్సాపురం, సీతపాలెం గ్రామాల సమీపంలోని సముద్ర తీరం వెంబడి దర్జాగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా సముద్ర ఇసుకను తరలించేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. సముద్ర తీరం వద్ద ఇసుక తవ్వకాలకు దారులు ఏర్పాటు చేసుకొని ఇసుకను తవ్వి టాక్ట్రర్లలో తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుకను రూ.3,500 నుంచి రూ.5 వేలు వరకు విక్రయిస్తున్నారు. సముద్ర తీరం వెంబడి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రక్షణగా ఉండే ఇసుక దిబ్బలను కొల్లగొడుతున్నారు. ఇసుకకు డిమాండ్ ఉండడంతో అక్రమార్కుల కన్ను సముద్ర తీరం వెంబడి ఉండే ఇసుక దిబ్బలపై పడింది. ఇరు పార్టీలకు చెందిన నాయకుల హస్తం ఇందులో ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సముద్ర ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jul 16 , 2025 | 01:05 AM