పాఠశాలల పునర్వ్యవస్థీకరణ షురూ
ABN, Publish Date - May 14 , 2025 | 12:58 AM
వైసీపీ హయాంలో వెలువడిన జీవో 117ను రద్దు చేస్తూ...పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 3,158
33 యూపీ పాఠశాలలు హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్
మోడల్ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎంలుగా స్కూలు అసిస్టెంట్
మొత్తం 538 పోస్టులు సర్దుబాటు
విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి):
వైసీపీ హయాంలో వెలువడిన జీవో 117ను రద్దు చేస్తూ...పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు కలిపి 3,158 ఉంటాయి. ఇందులో 228 ఫౌండేషన్ పాఠశాలలు, 1,921 బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 563 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 89 యూపీ పాఠశాలలు, 237 ఉన్నత పాఠశాలలు, 88 ఉన్నత పాఠశాలలు ప్లస్ బేసిక్ ప్రాథమిక పాఠశాలలు, 32 ఉన్నత పాఠశాలలు ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఉంటాయి. పిల్లల సంఖ్య ఎక్కువ కలిగిన, ఉన్నత పాఠశాలలు ఐదు కిలోమీటర్లకు మించి దూరంలో ఉన్న ప్రాంతాల్లో గల 33 యూపీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు.
పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, కొత్తగా ఏర్పాటుచేసే మోడల్ ప్రాథమిక పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్లను నియమించనున్నది. అయితే ఇప్పటికే ఎక్కువమంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్ కేడర్) ఉన్నచోట వారినే కొనసాగించనున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 563 మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 286 పాఠశాలలకు ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు పనిచేస్తున్నారు. మిగిలిన 277 మోడల్ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్లను హెచ్‌ఎంలుగా నియమిస్తారు. ఇందులో 252 మంది మండల/జడ్పీ పాఠశాలలు, 16 మంది ప్రభుత్వ పాఠశాలలు, తొమ్మిది మంది జీవీఎంసీలో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్లు ఉన్నారు.
తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి జిల్లాలో 538 హెచ్‌ఎంలు/స్కూలు అసిస్టెంట్లు/ఎస్జీటీ పోస్టులను ఒక పాఠశాల నుంచి మరోచోటకు సర్దుబాటు చేశారు. అందులో 277 మంది స్కూలు అసిస్టెంట్లను మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా నియమిస్తారు. మరో 28 స్కూలు అసిస్టెంట్లు, మూడు ఎస్జీటీ పోస్టులను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఇంకా 23 హెచ్‌ఎం, 103 స్కూల్ అసిస్టెంట్, 104 ఎస్జీటీ పోస్టులు...మొత్తం 230 పోస్టులను ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు సర్దుబాటు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలు తక్కువ గల ఉన్నత పాఠశాలల్లో హెచ్‌ఎం పోస్టులు రద్దు చేసి కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన ఉన్నత పాఠశాలలకు కేటాయించారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు మించి ఒక సబ్జెక్టులో ఎక్కువ మంది స్కూలు అసిస్టెంట్ పోస్టులు ఉంటే కొన్నింటిని అక్కడే కొనసాగించి మిగిలిన పోస్టులను అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు.
అప్‌గ్రేడ్ కానున్న ఉన్నత పాఠశాలలు..
ఉమ్మడి జిల్లాలో 33 యూపీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. బక్కన్నపాలెం (చినగదిలి మండలం), బంగారమ్మపాలెం, గోకులపాడు, గుర్రాజుపేట (ఎస్.రాయవరం), బవులువాడ, కుంచంగి, రామాపురం, సిరసపల్లి (అనకాపల్లి మండలం), చినఉప్పాడ (భీమిలి), చౌడుపల్లి, కొత్తపాలెం, కృష్ణాపురం, తాజంగి (చింతపల్లి), దండి సురవరం, దిబ్బపాలెం (చీడికాడ), దిబ్బపాలెం (అచ్యుతాపురం), దురువీధి (హుకుంపేట), జి.వెంకటాపురం, జంగాలపల్లి (మాకవరపాలెం), కరికంపుట్టు (ముంచంగిపుట్టు), కండేపల్లి (చోడవరం), కొడవటిపూడి (కోటవురట్ల), మల్లాం (బుచ్చెయ్యపేట), పల్లంపేట (పాయకరావుపేట), పెదపల్లి (ఎలమంచిలి), పొట్నూరు (పద్మనాభం), రమణయ్యపేట (నక్కపల్లి), రింతాడ (జీకే వీధి), నందివలస (అరకులోయ), కృష్ణాపురం (జి.మాడుగులు), ఆర్‌బీఎం యూపీ పాఠశాల (మహారాణిపేట), ముస్లింతాటిచెట్లపాలెం ఉర్దూ యూపీ పాఠశాల (సీతమ్మధార) ఉన్నాయి.
కొత్తగా అమలులోకి వచ్చిన విధానం ప్రకారం...అనకాపల్లి జిల్లాలో 1,396, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,200, విశాఖపట్నం జిల్లాలో 562 పాఠశాలలు ఉంటాయి.
జిల్లా ఫౌండేషన్ బేసిక్ మోడల్ యూపీ ఉన్నత ఉన్నత ఉన్నత
ప్రాథమిక ప్రాథమిక ప్లస్ బేసిక్ ప్లస్ మోడల్
అల్లూరి జిల్లా 36 925 199 13 16 4 9
అనకాపల్లి 151 764 187 55 145 78 18
విశాఖపట్నం 41 232 178 21 76 10 5
మొత్తం 228 1,921 563 89 237 88 32
Updated Date - May 14 , 2025 | 12:58 AM